సాక్షి, మహబూబాబాద్: సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి ఎ ట్టకేలకు మోక్షం లభించింది. జిల్లాలోని 125 టీచర్, 139 ఆయా పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
125 టీచర్, 139 ఆయా పోస్టుల భర్తీ..
జిల్లా వ్యాప్తంగా డోర్నకల్, గూడూరు, మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1,437 సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో 1,312 మంది టీచర్లు, 953 ఆయాలు పనిచేస్తున్నారు. అయితే ఇందులో 125 టీచర్లు, 139 ఆయాల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే 65 సంవత్సరాలు నిండాయని టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ కల్పించారు. ఈమేరకు ఇందులో 489 ఆయా పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇందులో ఏజెన్సీ ప్రాంతాలైన గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల మండలాల పరిధిలో ఉన్న 139 ఆయాల పోస్టులు మాత్రమే భర్తీకి అనుమతి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాతా శిశుసంరక్షణకోసం కోట్లాది నిధులు వెచ్చించి పౌష్టికాహారం అందిస్తుంటే వాటిని పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు వండి పెట్టేందుకు ఆయాలు లేరు. చాలా కాలం తర్వాత చేస్తున్న భర్తీ ప్రక్రియలో కేవలం ఏజెన్సీ ప్రాంతంలోని ఆయాల పోస్టులు మాత్రమే భర్తీ చేయడంపై మైదాన ప్రాంతం ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని కోరుతున్నారు.
భర్తీ ప్రక్రియ ఇలా..
గతంలో పదో తరగతి చదివిన వారికి అంగన్‌వాడీ పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు విద్యార్హత ఇంటర్మీడియట్‌కు పెంచారు. గతంలో మాదిరిగానే కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ కమిటీలో కలెక్టర్ చైర్‌పర్సన్‌గా ఉంటారు. ఆర్‌డీఓ, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్(ఏజెన్సీ), డీఎంహెచ్‌ఓ, డీడబ్ల్యూఓ మొత్తం ఐదుగురు కమిటీలో ఉంటారు. టీచర్, ఆయా పోస్టుల భర్తీ విషయంలో స్థానికతకు ప్రాధాన్యం ఉంటుంది.
మార్కుల కేటాయింపు..
మొత్తం100 మార్కులతో భర్తీ ప్రక్రియ నిబంధనలు ప్రకటించారు. ఇందులో ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కులకు మెరిట్ ఆధారంగా అత్యధికంగా 70 మార్కులు, వితంతులకు 5 మార్కులు, తల్లిదండ్రులు లేని వారికి 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు అదనంగా కలుపుతారు. కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులు కలిపి మెరిట్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారని అధికారులు చెబుతున్నారు.
మొదలైన పైరవీలు..
చాలాకాలం తర్వాత అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టడంతో ఆశావహులు అధిక సంఖ్యలో పోటీపడుతున్నారు. అదే విధంగా తమకు పోస్టు ఇప్పించాలని రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు మొదలయ్యాయి. మరోవైపు టీచర్ పోస్టుకు రూ. లక్ష నుంచి రూ. 2లక్షలు, ఆయా పోస్టుకు రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తే పోస్టులు ఇప్పిస్తామని దళారులు రంగప్రవేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తమకు రాజకీయ నాయకులు తెలుసు, మేము చెప్పిన వారికే ఉద్యోగం వస్తుందని పోటీలో ఉన్నవారిని నమ్మించే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
దళారుల మాట నమ్మవద్దు
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు ఇప్పిస్తామని ఇప్పటికే దళారులు సిద్ధమైనట్లు మా దృష్టికి వచ్చింది. ఎవరు కూడా దళారుల మాట నమ్మవద్దు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు, ఇతర పాయింట్లు వచ్చేందుకు అర్హత ఉన్నవారు మొత్తంగా మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది. దళారుల మాట నమ్మవద్దు. డబ్బులు ఇవ్వవద్దు.
– ఎం. సబిత, డీడబ్ల్యూఓ
125 టీచర్, 139 ఆయాల పోస్టుల నియామకం
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉన్నతాధికారులు
వారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు
సన్నద్ధం


