● తోటల సాగు, పట్టు పరిశ్రమకు
ప్రభుత్వం ప్రోత్సాహం
● రైతులకు సబ్సిడీ అందజేత
● పంట మార్పిడితో ప్రయోజనాలు
డోర్నకల్: మల్బరీ సాగు, పట్టు పరిశ్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. రైతులు అధిక లాభాలు పొందవచ్చని, పంట మార్పిడికి వీలు కలుగుతుందని, ప్రతీ సంవత్సరం ఎకరాకు రూ.2లక్షల వరకు ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయని పట్టుపరిశ్రమ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో సాగుకు జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు.
సాగు తేలిక..
పట్టు పురుగుల మేత కోసం మల్బరీ తోటలను సాగు చేస్తారు. అలాగే అక్కడే పట్టుపురుగుల పెంపకం కోసం షెడ్డు నిర్మించాల్సి ఉంటుంది. ఒకసారి మల్బరీ మొక్కలను నాటితే 15 సంవత్సరాల వరకు ఆకు లభిస్తుంది. కాగా, సంవత్సరానికి ఆరుసార్లు ఆకు కోసుకునే(6 పంటలు) అవకాశాలు ఉంటాయి. పురుగు మందుల అవసరం లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేయవచ్చు. ప్రస్తుతం జిల్లాలో డోర్నకల్, కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, ఇనుగుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ మండలాల్లో మల్బరీ సాగు, పట్టుగూళ్ల పెంపకం కొనసాగుతోంది. కాగా, మల్బరీసాగు, పట్టు పరిశ్రమ నిర్వహణపై ఆసక్తి కలిగిన రైతులు సహాయ పట్టు పరిశ్రమ అధికారులు కె.సురేష్(9966757765), డి.రాజయ్య(9989270269)ను సంప్రదించవచ్చు.
ప్రభుత్వ రాయితీ..
పట్టు పరిశ్రమ, మల్బరీ సాగు పథకంలో భాగంగా రెండెకరాల(యూనిట్) పంట సాగు కోసం ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. మొక్కల పెంపకం, నీటి వసతి, షెడు నిర్మాణం తదితరాల కోసం భారీగా రాయితీలు ప్రకటించింది.
మూడోసారి సాగు చేస్తున్నా..
నా వ్యవసాయ భూమిలో మల్బ రీసాగు, పట్టు పురుగుల నిర్వహణ మూడోసారి ప్రారంభించా. మొదటి సారి షెడ్డు నిర్మాణం, మల్బరీ మొక్కలను నాటాను. మల్బరీ సాగు ఆశాజనకంగా ఉంది.
– చంద్రశేఖర్, సత్యతండా, డోర్నకల్
ఉత్సాహం చూపే రైతులకు
ప్రోత్సాహం
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం చేసేందుకు ఉత్సాహం చూపే రైతులకు సబ్సిడీలతో ప్రోత్సాహం అందిస్తున్నాం. మల్బరీ సాగుతో వాణిజ్య పంటలకంటే ఎక్కువ ఆదాయం పొందవచ్చు. పంట మార్పిడి చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది.
– అనసూయ, జిల్లా పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకులు, హనుమకొండ
వివరాలు యూనిట్ ధర రాయితీ
(రూ.లలో) (రూ.లలో)
ఎస్సీ ఎస్టీ ఇతరులు
మొక్కల పెంపకం 1,20,000 1,08,000 1,08,000 90,000
నీటి వసతి 1,00.000 65,000 65,000 50,000
పురుగు మందులు 5,000 3,200 3,200 2,500
షెడ్డు నిర్మాణం 4,50,000 4,05,000 4,05,000 3,37,500
పెంపకం పరికరాలు 75,000 48,750 48,750 37,500
మొత్తం 7,50,000 6,30,000 6,30,000 5,17,500


