పింఛనో రామచంద్రా.. | - | Sakshi
Sakshi News home page

పింఛనో రామచంద్రా..

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో నూతన పింఛన్ల మంజూరు కోసం లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అర్హత ఉన్నా ఆసరా అందడం లేదని వారు వాపోతున్నారు. నాలుగేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. కాగా, ప్రభుత్వం ఇటీవల అర్హులకు నూతన పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో జిల్లాలో 25వేల మంది అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రస్తుతం 1.09లక్షల మందికి..

జిల్లా వ్యాప్తంగా 1,09,240 మందికి ప్రతీ నెల రూ.27.86కోట్ల పింఛన్‌ అందజేస్తున్నారు. ఇందులో 45,707 మంది వృద్ధులు, 41,500మంది వితంతువులు, 380మంది చేనేత కార్మికులు, 2,938మంది గీత కార్మికులు, 375మంది బోదకాలు, 14మంది బీడీ కార్మికులు, 3014మంది ఒంటరి మహిళలు, 74 డయాలసిస్‌ పేషెంట్లకు నెలకు రూ. 2,016 చొప్పున, 15,238 మంది దివ్యాంగులకు నెలకు రూ. 4,016 చొప్పున అందజేస్తున్నారు.

అర్హత ఉండి ఎదురుచూపులు..

ప్రభుత్వం 2022 ఆగస్టు ఒకటో తేదీ వరకు ఆత్మీయ భరోసా నూతన పింఛన్లు మంజూరు చేసింది. ఆ తర్వాత ఒక్క కొత్త పింఛన్‌ కూడా మంజూరు చేయలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు 25వేల మందికి పైగా కొత్త పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో 2024 జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తులు స్వీకరించారు. కాగా, వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగ, నేత, గీత కార్మికులు మొదలైన వారు 17,111 మంది తాము పింఛన్‌ పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే వితంతువులు, ప్రమాదాల్లో కాళ్లు, చేతులు పోగొట్టుకున్నవారు, వివిధ రకాల వైకల్యం పొందిన వారు, పింఛన్‌ పొందేందుకు వయస్సు వచ్చిన వారు కలిపి మొత్తంగా 25వేల మందికిపైగా పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

నాయకుల ప్రకటనతో ఆశలు..

ఇటీవల జరిగిన సభలు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో అర్హతలు ఉండి ఏళ్ల తరబడి పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న వారిలో ప్రజా ప్రతినిధులు, అధికారుల ప్రకటనలతో ఆశలు చిగురించాయి. కొత్త పింఛన్లు త్వరగా మంజూరు చేయాలని కోరుతున్నారు.

నాలుగేళ్లుగా కొత్త పింఛన్లకు

మోక్షం కరువు

సదరం సర్టిఫికెట్‌ పట్టుకొని

ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ

వృద్ధులు, వితంతువులు, నేత,

గీత కార్మికుల ఎదురుచూపులు

Advertisement
 
Advertisement
Advertisement