వినతులు వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వినతులు వెంటనే పరిష్కరించాలి

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

ప్రజావాణిలో 170 అర్జీల రాక

మహబూబాబాద్‌: ప్రజావాణి వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..పెండింగ్‌ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వినతులను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రతీ దరఖాస్తుకు అత్యంత ప్రాధాన్యం ఇ వ్వాలన్నారు. 170వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

వచ్చిన వాటిలో కొన్ని వినతులు పరిశీలిస్తే..

● జిల్లాలో విద్యార్థులు లేరనే కారణతో 162 పాఠశాలలను మూసివేశారని, తిరిగి వాటిని పునఃప్రారంభించాలని తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్‌ మైస శ్రీనివాసులు వినతిపత్రం అందజేశారు.

● పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పాయం చిన్న చంద్రన్న, రాములు, బిక్షం, సత్యం తదితరులు పాల్గొన్నారు.

● మరిపెడ మండలం తాళ్లఊకల్‌ గ్రామానికి చెందిన రైతులు హరి, మల్లయ్య, భాస్కర్‌, సతీష్‌ ఆ గ్రామంలోని ఐకేపీ నిర్వాహకురాలు రైతులను ఇబ్బంది పెడుతుందని, విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వినతి ఇచ్చారు.

● జిల్లా కేంద్రానికి చెందిన వక్కల శ్రీనివాస్‌ తన షాపుల సమీపంలో రోగులు మూత్ర విసర్జన చేస్తున్నారని, ఆస్పత్రిలో పలు మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉండడంతో బహిరంగ మూత్రవిసర్జన చేస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. వెంటనే ఆ మరుగుదొడ్ల తాళాలు తీయించి సమస్య పరిష్కరించాలని కోరాడు.

Advertisement
 
Advertisement
Advertisement