ఏటూరునాగారం : బంగారం ఇస్తామని ఓ కుటుంబం మరో కుటుంబాన్ని మోసం చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలను బాధితుడు కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడేనికి చెందిన కొండగొర్ల వెంకన్న సోమవారం ఏటూరునాగారంలో విలేకరులకు వెల్లడించారు. కొండగొర్ల వెంకన్న కుమారుడు చరణ్, మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన జిలానీ(అలియాస్) షేమినా, రబ్బానీ దంపతుల కుమారుడు విరానీ స్నేహితులు. ఈ క్రమంలో విరానీ ద్వారా జిలానీ షేమినా, రబ్బానీ దంపతులు వెంకన్న కుటుంబానికి దగ్గరయ్యారు. తమ వద్ద తవ్వకాల్లో బయపడిన బంగారం ఉందని, రూ.30 లక్షలు ఇస్తే ఇస్తామని నమ్మబలికారు. దీంతో కొండగొర్ల వెంకన్న దంపతులు ఆ నగదు ఇచ్చారు. అయితే బంగారం ఇవ్వకుండా రేపు మాపు అంటూ సుమారు మూడేళ్ల నుంచి కాల యాపన చేస్తూ తిప్పకుంటున్నారు. దీంతో విసుగు చెందిన బాధితులు పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. దీంతో జిలానీ షేమినా, రబ్బానీ దంపతులు రూ. 18లక్షలు ఇస్తామని గతేడాది పత్రం రాసి ఇచ్చారు. అయితే ఏడాది గడిచినా ఇప్పటి వరకూ డబ్బులు ఇవ్వకపోడంతో ఏటూరునాగారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెంకన్న తెలిపాడు. దీనిపై పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
రూ.30 లక్షలు తీసుకుని
మోసం చేసిన దంపతులు
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
చేసిన బాధితుడు


