రేపు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్‌

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

రేపు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్‌

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి బుధవారం రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రానున్నారు. ప్రాజెక్టులో జరుగుతున్న పలు పరీక్షలు తుది దశకు చేరడంతో పరిశీలనకు ప్రత్యేకంగా హెలికాప్టర్‌లో రానున్నారని సోమవారం ఇరిగేషన్‌శాఖ కార్యాయం నుంచి షెడ్యూల్‌ వెలువడింది. మంత్రి ఉత్తమ్‌ మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నం 12:45 గంటలకు చేరుకుని క్షేత్రస్థాయిలో జియోఫిజికల్‌, జియోటెక్నికల్‌, జీపీఆర్‌, ఎన్‌డీటీ, ఎస్‌పీ టీ, పర్మియబిలిటీ పరీక్షల పనులు పరిశీలిస్తారు. అనంతరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై రివ్యూ నిర్వహించనున్నారు. తిరిగి 1:45 గంటలకు ఖమ్మం జిల్లాకు వెళ్తారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి మృతి

చిల్పూరు: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నష్కల్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్‌ కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన కొమ్మాల జస్వంత్‌(19), మడాల అభిరామ్‌ మిత్రులు. అభిరామ్‌ పుట్టిన రోజు ఉండడంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. పార్టీ చేసుకున్న అనంతరం ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బైక్‌పై హనుమకొండకు వెళ్తున్నారు. ఈ క్రమంలో చిల్పూరు మండలం నష్కల్‌ సమీపంలో లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ఢీకొనడంతో జస్వంత్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చేనేత కార్మికురాలు

హఠాన్మరణం

కాశిబుగ్గ : వరంగల్‌ కొత్తవాడ 23వ డివిజన్‌లో సుదీర్ఘకాలంగా చేనేత సహకార సంఘం సభ్యురాలిగా కొనసాగుతున్న కర్నే శాంతమ్మ(70) సోమవారం హఠాన్మరణం చెందారు. చేనేత వృత్తిపై ఆధారపడి 45 సంవత్సరాలుగా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం టెండర్‌ విధానంలో బెడ్‌ షీట్స్‌, కార్పెట్స్‌ ఆర్డర్స్‌ ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా చేనేత మగ్గాలు మూలన పడ్డాయని నిరసన వ్యక్తి చేస్తూ దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పనిలేక మనస్తాపం చెందిన శాంతమ్మ చనిపోయినట్ల టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిప్పా వెంకటేశ్వర్లు తెలిపారు. శాంతమ్మ చేనేత బీమా పథకంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ద్వారా వచ్చే రూ. 5 లక్షలు ఆ కుటుంబానికి త్వరితగతిన అందించాలని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీకాంత్‌ రెడ్డికి వినతి పత్రం అందచేశారు. కాగా, మృతురాలికి కుమారుడు రఘుపతి, కూతురు చిప్ప పద్మ ఉన్నారు.

అక్రమ దత్తతను ఛేదించిన అధికారులు

భూపాలపల్లి రూరల్‌: జిల్లాలోని మల్హర్‌ మండలం దుబ్బపల్లి గ్రామంలో అక్రమ దత్తత ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవల హనుమకొండలోని ఓ ఆస్పత్రిలో ప్రసవించింది. అప్పటికే ఆమెకు ఒక కుమారుడు, కూతురు ఉంది. భర్త వదిలేయడంతో ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇటీవల పుట్టిన కుమారుడిని మధ్యవర్తుల ద్వారా పెద్దపల్లి జిల్లా మంథనిలో ఒకరికి దత్తత ఇచ్చింది. ఈ విషయం తెలిసిన జిల్లా అధికారులు దత్తత ఇచ్చిన వారిని, తీసుకున్న వారిని హనుమకొండ సీడబ్ల్యూసీకి పంపించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. కాగా, ఇటీవల జన్మించిన బాబును కన్నతల్లికి అప్పగించినట్లు జిల్లా సంక్షేమ అధికారిని మల్లేశ్వరి తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు, పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement