గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్న ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

మంత్రగాళ్ల పేరుతో సంచరిస్తున్న ముగ్గురి బైండోవర్‌

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్న ఆదిలాబాద్‌లోని టీచర్స్‌ కాలనీకి చెందిన ఇంజారపు వెంకటరమణ ప్రసాద్‌, హనుమకొండలోని సుధానగర్‌కు చెందిన వలబోజు శ్రీనివాస్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. భూపాలపల్లి సీసీఎస్‌ సీఐ రమేశ్‌ కథనం ప్రకారం.. నిందితులు ఆరు నెలలుగా కాళేశ్వరం అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం ఎలక్ట్రానిక్‌ పరికరాలతో సంచరిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు అప్పగించినట్లు సీఐ తెలిపారు. గుప్త నిధులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గూడూరు: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం వెంగంపేట శివారు పాల్త్యాతండాలో మంత్రగాళ్లమంటూ దయ్యాలు, భూతాలు తొలగిస్తామని తిరుగుతున్న ముగ్గురిని అరెస్ట్‌ చేసి తహసీల్దార్‌ నాగభవాని ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. వెంగంపేట సమీప తండాల్లో ఇటీవల కొందరు వ్యక్తులు తమకు మంత్రాలు వస్తాయని.. కార్లలో వస్తూ గిరిజనులకు దయ్యాలు, భూతాలు, చేతబడులు ఉన్నాయని నమ్మబలుకుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కొందరు తండావాసులు గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం వచ్చిన ముగ్గురిని అడ్డగించి ప్రశ్నించగా భయపడి పారిపోబోయారు. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిలో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన జుజ్వువం గోపాలస్వామి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ మండలం తుంగారం గ్రామానికి చెందిన పట్ర నాగేందర్‌, సోడెపోగు బసవేశ్వర్‌తోపాటు వీరిని తీసుకొచ్చిన పాల్త్యాతండాకు చెందిన సోమ్లానాయక్‌ను విచారించి తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement