కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (ఎస్‌డీఎల్‌సీఈ) పీజీ ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు (2023–2024 బ్యాచ్) సోమవారం ప్రారంభమయ్యాయి. 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని వరంగల్‌ఎల్‌బీ కళాశాల, ఏఎస్‌ఎం డిగ్రీ కళాశాల, హంటర్‌రోడ్డులోని అల్లూరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌సైన్సెస్‌లోని కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షలనియంత్రణాధికారి పద్మజ సందర్శించారు. ఈసందర్భంగా ఆయా కేంద్రాల్లో కొందరు విద్యార్థులు తమకు పాఠ్య పుస్తకాలు, స్టడీమెటీరియల్ ఇవ్వలేదని, పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించి వాగ్వాదానికి దిగారు. పరీక్షల విభాగం అధికారులు మాట్లాడుతూ తాము పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని పాఠ్యపుస్తకాలు కాని స్టడీమెటీరియల్‌ను కాని ఇచ్చేది దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బాధ్యతన్నారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించడం సరికాదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాకుండా వివిధ సబ్జెక్టుల పేపర్ పరీక్షల ప్రశ్నపత్రాలు కేవలం ఇంగ్లిష్‌లోనే ఇచ్చారని, తెలుగులో ఇవ్వలేదని విద్యార్థులు మండిపడ్డారు. దీంతో పరీక్షల విభాగం అధికారులు నిబంధనల ప్రకారం పీజీ కోర్సుల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్‌లోనే ఇస్తున్నామని తెలిపారు. కాగా, మిగతా కేంద్రాలకు సిబ్బంది వెళ్లినప్పుడు కూడా అక్కడ కూడా స్టడీ మెటీరియల్ ఇవ్వకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారని తమకు సమాచారం అందిందని అదనపు పరీక్షలనియంత్రణాధికారి పద్మజ తెలిపారు. స్టడీమెటీరియల్ ఇవ్వడం తమ బాధ్యత కాదని వివరణ ఇచ్చారు. తొలిరోజు వివిధ కోర్సుల సబ్జెక్టుల పరీక్షలకు 40నుంచి 50శాతం మంది విద్యార్థులే హాజరయ్యారని పద్మజ తెలిపారు.
పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండానే పరీక్షలా!
అధికారులతో విద్యార్థుల వాగ్వాదం


