పోక్సో కేసులో నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

వరంగల్‌ లీగల్‌: పోక్సో కేసులో వరంగల్‌ దేశాయిపేట వివర్స్‌ కాలనీకి చెందిన మోత్తూరి శివ అలియాస్‌ శివకుమార్‌కు ఇరువై ఏళ్ల జైలు, రూ.1.05 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి క్షమాదేశ్‌ పాండే సోమవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గంపా వెంకటరమణ కథనం ప్రకారం.. గతంలో వరంగల్‌ నగరంలోని ఓ కాలనీలో నివసిస్తున్న పదో తరగతి చదువుతున్న ఓ బాలికతో అదే కాలనీలో ఉంటున్న శివ ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పరిచయమై స్నేహం చేశాడు. మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. తరచూ బాలిక సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు, కాల్స్‌ చేస్తూ మాట్లాడేవాడు. దీనిని గమనించిన తల్లిదండ్రులు బాలికకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలిక భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ కాలనీ నుంచి ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే బాలిక వద్ద ఫోన్‌ లేకపోవడంతో శివ సెల్‌ఫోన్‌ కొనిచ్చి రహస్యంగా మాట్లాడేవాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి వచ్చి నేను చెప్పినట్లు చేయాలి.. నాతో మాట్లాడాలి.. లేదంటే నిన్ను, మీ కుటుంబీకులను చంపుతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో బాలిక సెల్‌ఫోన్‌ ఇంట్లో పెట్టి బంధువుల వద్దకు వెళ్లిన సమయంలో తల్లిదండ్రులకు దొరకడంతో అందులో ఉన్న మెసేజ్‌లు, నగ్న ఫొటోలు చూసి బాలిక ద్వారా విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగస్టు 06, 2022న మట్టెవాడ పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడు శివను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో నేరస్తుడు శివకు ఇరువై ఏళ్ల జైలు శిక్ష రూ.1.05 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. కేసును ఏసీపీ కె.గిరికుమార్‌ పరిశోధించగా లైజన్‌ ఆఫీసర్‌ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్‌కానిస్టేబుల్‌ రమేశ్‌, హోంగార్డు శ్రీనివాస్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement