● స్కానింగ్ పేరుతో గంటల తరబడి నిలబెట్టొద్దు
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ప్రతీ దరఖాస్తును నిర్దిష్ట గడువులోగా పరిష్కరించి అర్జీదారులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ప్రజావాణి పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతుండడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ప్రజావాణిపై ఎంతో నమ్మకంతో వచ్చే ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దరఖాస్తుల స్కానింగ్ పేరుతో ప్రజలను గంటల తరబడి నిరీక్షిస్తుండడం సరికాదని, ఈ విధానాన్ని వెంటనే మార్చాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ దరఖాస్తును వెంటనే స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు ఏ అర్జీ కూడా పెండింగ్‌లో ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, మండల స్థాయిలో పెండింగ్ అర్జీల పరిష్కారానికి తహసీల్దార్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రజావాణి వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 365 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


