● హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్ : పరకాల మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు పనిచేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. పరకాల మున్సిపల్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గ్రూప్–1 అధికారి పోతరాజు పవనన్‌కు విధుల నిర్వహణ, మున్సిపాలిటీ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, పన్నుల వసూళ్లు, మౌలిక వసతులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ, అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, ఏఈ రవీందర్, టీపీఎస్ సుమన, టీపీబీఓ సందీప్, జూనియర్ అకౌంట్స్ అధికారి అర్షద్ తదితరులు పాల్గొన్నారు.
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 21న నిర్వహించనున్న నీట్–6 (యూజీ) పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 12 పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో నీట్ జిల్లా కో–ఆర్డినేటర్ బిక్షపతి, ఏసీపీ నరసింహారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి గౌరీశంకర్, ఈడీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
పిడుగుపాటుకు ఇల్లు దగ్ధం
● రూ.5లక్షల నష్టం
చిట్యాల : పిడుగుపాటుతో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని జడలపేట గ్రామ శివారు గాంధీనగర్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన రత్న సారయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మూడ్రోజుల క్రితం అతడి పెద్ద కుమారుడు చిరంజీవి అనార్యోగంతో ఉండడంతో వరంగల్‌ని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కురిసిన వర్షంతో పాటు పిడుగు పడడంతో సారయ్య ఇల్లు పూర్తిగా కాలిపోయింది. గమనించిన గ్రామస్తులు మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, దుస్తువులు, బీరువా అందులో ఉన్న ఆభరణాలు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా సారయ్యతో పాటు కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేకపోడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. సారయ్యకు భార్య మల్లమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
నిరంతరం చెలిమె నీరే..
మహాముత్తారం : ప్రభుత్వం సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నా కాలనీవాసులు మాత్రం చెలిమె నీటినే తాగుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని కొర్లకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీపాదకాలనీ వాసులు కొన్నేళ్లుగా గ్రామ సమీపంలోని వాగు ఒడ్డుకు ఉన్న చెలిమెకు సిమెంట్ ఓడలు ఏర్పాటు చేసి ఆ నీటినే నిరంతరం వినియోగిస్తున్నారు. ప్రస్తుత ం గ్రామంలో ఇంటింటికి సురక్షిత (మిషన్ భగీరథ) తాగునీరు సరఫరా అవుతున్నప్పటికీ కాలనీవాసులు మాత్రం ప్రత్యేకంగా చెలిమె నీటిని వినియోగించడం గమనార్హం. ఈ విషయంపై గ్రామస్తులను సాక్షి పలకరించగా తా ము సుమారు 40 సంవత్సరాల నుంచి చెలిమె నీరు తాగడం అలవాటుగా మారిందన్నారు.
చెలిమె నీరు రుచిగా ఉంటుంది
కాలనీ వాసులకు కొన్నేళ్ల నుంచి చెలిమె నీరు తాగడం అలవాటుగా మారింది. నీరు కూడా రుచిగా, తియ్యగా ఉంటుంది. అందుచేత కాలనీవాసులు రోజు ఈ నీటినే వాడుతారు. మేము కూడా 40ఏండ్ల నుంచి చెలిమె నీళ్లనే తాగుతున్నాం.
– బెల్లంకొండ మధునయ్య,
శ్రీపాదకాలనీ, కొర్లకుంట


