దేవునిగుట్టకు విముక్తి | - | Sakshi
Sakshi News home page

దేవునిగుట్టకు విముక్తి

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

బ్లాక్‌ గ్రానైట్‌ క్వారీ లీజు రద్దు చేసిన

జనగామ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

రెండేళ్ల వివాదానికి తెర

జనగామ : జిల్లాలోని దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామ పరిధిలోని వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్న దేవుని గుట్టపై అక్రమంగా సాగుతున్న బ్లాక్‌ గ్రానైట్‌ క్వారీ లీజును రద్దు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకు ండా, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన రెవెన్యూ ఎన్‌ఓసీని రద్దు చేస్తూ, లీజును రద్దు చేయాలని మైనింగ్‌ శాఖకు సిఫార్సు చేశారు.

అసలేం జరిగింది..

2018లో మెస్సర్స్‌ రోహిత్‌పాల్‌ మినరల్స్‌కు ధర్మాపురం సర్వే నంబర్‌ 37లో 6 హెక్టార్లలో బ్లాక్‌ గ్రానైట్‌ క్వారీకి లీజు మంజూరైంది. ఆలయం, హరితహారం మొక్కల రక్షణ కోసం 1.15 హెక్టార్లు తొలగించి 4.85 హెక్టార్లకు 2022లో 20 ఏళ్ల లీజు అమల్లోకి వచ్చింది. అయితే పనులు మొదలు కాగానే ధర్మాపురం, కడవెండి, లకావత్‌ తండా గ్రామాల ప్రజలు, సర్పంచులు తీవ్రంగా వ్యతిరేకించారు.

ప్రజల ఫిర్యాదులివే..

క్వారీకి ధర్మాపురం గ్రామ పంచాయతీ ఎలాంటి తీర్మానం, అనుమతి ఇవ్వలేదని పలువురు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఇచ్చిన రెవెన్యూ ఎన్‌ఓసీకి సంబంధించి నోట్‌ ఫైల్‌, కరెంట్‌ ఫైల్‌ ఆఫీసులోనే లేవని విచారణలో తేల్చారు. ప్రాచీన వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్‌ యార్డుకు నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. లీజుదారుడు బకాయిలు చెల్లించకపోవడంతో 2023 నుంచి క్వారీ పూర్తిగా మూతబడింది. ఇందుకు సంబంధించి ఈనెల 7వ తేదీన ఇచ్చిన ఫైనల్‌ ఆర్డర్‌లో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాలు జారీ చేశారు.

ఎన్‌ఓసీ రద్దు..

గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఇచ్చిన తహసీల్దార్‌ ఎన్‌ఓసీని తక్షణమే రద్దు చేశారు. లీజుకు చట్టబద్ధమైన పునాది లేదని తేల్చి, క్వారీ లీజును రద్దు చేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌, జియాలజీకి ఫైల్‌ పంపాలని ఆదేశించారు. మూడు రోజుల్లో ఆర్డీఓ, తహసీల్దార్‌ సంయుక్తంగా పంచనామా నిర్వహించి 4.85 హెక్టార్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ భూమిని అతిక్రమించకుండా, బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. 10 రోజుల్లో సర్వే నంబర్‌ 37 రెవెన్యూ రికార్డుల్లో లీజు ప్రస్తావన తొలగించి ప్రభుత్వ భూమిగా నమోదు చేయాలని సూచనలు చేశారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ, లకావత్‌ తండా సర్పంచ్‌ జాటోత్‌ ఆనంద్‌, గ్రామస్తుల ఫిర్యాదులతో కలెక్టర్‌ బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 94 కింద విచారణ చేపట్టారు. అలాగే ఇటీవల క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పల్లా సుందర్‌ రాంరెడ్డి ఉద్యమం తీవ్రం చేయగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అన్ని పక్షాలను విచారించిన కలెక్టర్‌ ఈ ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దేవుని గుట్టపై రెండేళ్లుగా నిలిచిపోయిన క్వారీ వివాదానికి తెరపడినట్లయింది.

Advertisement
 
Advertisement
Advertisement