టీపీఎస్‌ ఏర్పాటుకు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

టీపీఎస్‌ ఏర్పాటుకు పరిశీలన

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

వరంగల్‌ వెస్ట్‌కు కాజీపేట

బాలుర హైస్కూల్‌లోనే..

పరకాలకు పెద్దాపూర్‌ జెడ్పీఎస్‌ఎస్‌లోనే తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌

విద్యారణ్యపురి : ఈ విద్యా సంవత్సరం (2026–27) నుంచి రాష్ట్రంలోని ప్రతీ నియోజక వర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా తీసుకుంటుంది. హనుమకొండ జిల్లాలోను నియోజకవర్గానికి ఒకటి చొప్పున నాలుగు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయబోతున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో వరంగల్‌ పశ్చిమలోని కాజీపేట ప్రభుత్వ హైస్కూల్‌ (బాయ్స్‌) లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. సోమవారం సాయంత్రం ఈ స్కూల్‌ను కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుమారు 2 ఎకరాల 11గుంటల వరకు ఉంటుందని డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌ తెలిపారు. దీంతో కాజీపేట ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లోనే తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను ఏర్పాటుకు కలెక్టర్‌ నిర్ణయించారు. ఎంఈఓ బి.మనోజ్‌కుమార్‌, టీజీడబ్లూఐఈడీసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. అలాగే కాజీపేట జాగీర్‌ కో ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ హైస్కూల్‌ను కూడా కలెక్టర్‌ సందర్శించి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు అనువుగా ఉంటుందా అని పరిశీలించినట్లు సమాచారం.

పెద్దాపూర్‌ జెడ్పీఎస్‌ఎస్‌ను సందర్శన..

ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సోమవారం డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌, ఎంఈఓ, ఇతర రెవెన్యూ, ఇంజనీరింగ్‌ అధికారులు సందర్శించి పరిశీలించారు. ఇక్కడే పరకాల నియోజక వర్గానికి సంబంధించిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలనే యోచన ఉందని డీఈఓ తెలిపారు. తొలుత నీరుకుళ్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేయాలని ఎంపిక చేసినా ఇక పెద్దాపూర్‌ జిల్లా పరిషత్‌హైస్కూల్‌లోనే ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ హైస్కూల్‌ స్థలం నాలుగు ఎకరాల వరకు ఉంది. ఇప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని నారాయణగిరి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, వర్ధన్నపేట నియోజకవర్గంలో హసన్‌పర్తి ప్రభుత్వ గర్‌ల్స్‌ హైస్కూల్‌లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు ఎంపిక చేశారు. ఒక్కో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌కు ప్రభుత్వం రూ.15కోట్ల చొప్పున నిధులు ఇవ్వనుందని తెలుస్తోంది. ఆయా నిధులతోనే అన్ని హంగులతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు కానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement