మహిళలకు ఆర్టీసీ అద్దె బస్సులు | - | Sakshi
Sakshi News home page

మహిళలకు ఆర్టీసీ అద్దె బస్సులు

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీ

వరంగల్‌ రీజియన్‌లో 86 బస్సుల కేటాయింపు

హన్మకొండ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన కేటాయించింది. వరంగల్‌ రీజియన్‌లోని 9 డిపోల పరిధిలో 86 బస్సులు మహిళలకు కేటాయించగా నేడు (ఈనెల 9న) హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి మహిళా సంఘాలకు ఈ అద్దె బస్సులు అందించనున్నారు. అద్దె బస్సుల్లోనే మహిళలను బస్సుల పంపిణీ కార్యక్రమానికి తరలివెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో పురుషులతో పాటు మహిళల భాగస్వామ్యం ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుందని భావించి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తోంది. ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించి మహిళా సంఘాలకు బస్సులు కొనిచ్చి వాటిని నడిపే బాధ్యత ఆర్టీసీకి అప్పగించింది. వరంగల్‌ రీజియన్‌లోని మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా హనుమకొండ డిపోకు 14, వరంగల్‌–1 డిపోనకు– 2, తొర్రూరు–5, భూపాలపల్లి–14, జనగామ–14, నర్సంపేట–13, మహబూబాబాద్‌–9 బస్సులు కేటాయించారు. వరంగల్‌–2 డిపోను ప్రైవేటు సంస్థ జేబీఎంకు అప్పగించడంతో ఇక్కడ మహిళలకు అద్దె బస్సులు కేటాయించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement