ఫిట్‌నెస్‌పై కదలట్లే..! | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌పై కదలట్లే..!

Jun 8 2026 9:35 AM | Updated on Jun 8 2026 9:35 AM

ఫిట్‌నెస్‌పై కదలట్లే..! ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డెక్కితే కేసులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

రో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేలాది మంది విద్యార్థులు మళ్లీ బడి బస్సులు, వ్యాన్లలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విద్యార్థుల ప్రాణ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అనేక ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు, వ్యాన్లు ఫిట్నెస్‌ చేయించుకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 33.43 శాతం బస్సులు ఇంకా సామర్థ్య పరీక్షల నిర్ధారణ (ఫిట్‌నెస్‌) సర్టిఫికెట్లు పొందలేదు. సోమవారం (జూన్‌ 1) నాటికి 820 బస్సులు ఫిట్‌నెస్‌కు దూరంగా ఉన్నాయి.

ఫిట్‌నెస్‌ నత్తనడకపై సాక్షి కథనం..

స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ నత్తనడకన నడుస్తోందని ‘సాక్షి’ వారం కిందటే కథనం రూపంలో అధికారులు దృష్టికి తీసుకెళ్లింది. వారిలో పెద్ద కదలిక లేకపోవడం, ఇటు స్కూల్‌ యాజమాన్యాలు కూడా మాములుగా తీసుకోవడంతో వారం రోజుల్లో 125 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ చేశారు. ఇంకా 693 బస్సులకు బీమా, పర్మిట్లు, కాలుష్య ధ్రువపత్రాలు సైతం నవీకరించకపోయినా అధికారులు కఠిన చర్యలకు కదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తనిఖీలు, చర్యలు ఇంకెప్పుడు..?

హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జేఎస్‌ భూపాలపల్లి జిల్లాల్లో వందలాది ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కువభాగం విద్యార్థుల రవాణాకు బస్సులు, వ్యాన్లు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు ఈ వాహనాలపై ఆధారపడుతున్నారు. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రవాణా శాఖ, పోలీసులు, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలి. కానీ పాఠశాలలు తెరుచుకునే సమయం దగ్గరపడుతున్నా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విస్తృత స్థాయిలో తనిఖీలు జరగలేదని తెలుస్తోంది. రవాణాశాఖ గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్‌లో మొత్తం 2,079 స్కూల్‌ బస్సులు, వ్యాన్లు ఉంటే.. శనివారం నాటికి 1,386 వాహనాలకే సామర్థ్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేశారు. 693 బస్సులకు ఇంకా ఫిట్‌నెస్‌ నిర్వహించలేదు. హనుమకొండ జిల్లాలో 348, వరంగల్‌లో 172, మహబూబాబాద్‌లో 43, జనగామలో 75, జేఎస్‌ భూపాలపల్లిలో 28, ములుగులో 27 బస్సులు ఫిట్‌నెస్‌కు దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, గతేడాది తనిఖీల్లో అరిగిపోయిన టైర్లు, పని చేయని ఎమర్జెన్సీ డోర్లు, గడువు ముగిసిన ఫైర్‌ ఎక్స్‌టింగ్విస్టర్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ లేకపోవడం, సీట్లకు మించి విద్యార్థులను ఎక్కించడం, జీపీఎస్‌ పరికరాలు పనిచేయకపోవడం, స్పీడ్‌ గవర్నర్లు లేకపోవడం వంటి ప్రధాన లోపాలను గుర్తించి సరిచేశారు. ఈసారి 693 బస్సులు ఇంకా ఫిట్‌నెస్‌కు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఫిట్‌నెస్‌ లేకుండా పాఠశాల బస్సులు రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తాం. ఫిట్‌నెస్‌ తోపాటు డ్రైవర్‌ తప్పని సరిగా లైసెన్స్‌ కలిగి ఉండాలి. క్లీనర్‌తోపాటు మిగతా నిబంధనలు కచ్చితంగా పాటించాలి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవద్దు.

– నాగలక్ష్మి, ఎంవీఐ, హనుమకొండ

గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా

నడుపుతున్నారు

కొన్ని పాఠశాలల నిర్వాహకులు ఫిట్‌నెస్‌ లేని బస్సులను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతున్నారు. ఇక్కడ తనిఖీలు ఎక్కువ జరగవని, ఎవరూ పట్టించుకోరని నడుపుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే అధికారులు తనిఖీలు నిర్వహించాలి.

– నద్దునూరి నాగరాజు, పేరెంట్‌

సీరియస్‌గా తీసుకోని

స్కూళ్ల యాజమాన్యాలు, అధికారులు

ఉమ్మడి జిల్లాలో 2,079 స్కూల్‌

బస్సులకు 1,386కే సామర్థ్య పరీక్షలు

వారంలో 125 బస్సులకే ఫిట్‌నెస్‌.. ఇంకా ఫిట్‌నెస్‌ లేనివి 33.43 శాతం

వారంలో తెరుచుకోనున్న స్కూళ్లు.. తనిఖీలు, చర్యలపై మీనమేషాలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఇలా...

స్కూల్‌ బస్సులు : 2,079

ఫిట్‌నెస్‌ చేసినవి : 1,386

చేయించుకోనివి : 693

Advertisement
 
Advertisement
Advertisement