● రైతులకు ప్రభుత్వం సూచన
● ఎల్‌నినో నేపథ్యంలో యాజమాన్య
పంటల ప్రణాళిక విడుదల
మహబూబాబాద్ రూరల్: తెలంగాణ ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాజమాన్య పంటల ప్రణాళికను రూపొందించింది. సాధారణంగా ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడం, వర్షాల రాకలో ఆలస్యం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, నీటి నిర్వహణ, సాగు విధానాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది.
వర్షపాతం అంచనాలతో పంటల సాగు..
వర్షపాతం అంచనాలను పరిశీలించి, అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులు తక్కువ నీటి అ వసరం ఉండే పంటలను సాగు చేయాలని అధికా రులు సూచించారు. కంది, పెసర, మినుములు, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు వంటి పంటలు రైతులకు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే వర్షాభావ పరిస్థితులను తట్టుకునే విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
విత్తనాలు సిద్ధం చేసుకోవడం..
రైతులు వర్షాల పరిస్థితిని బట్టి దశలవారీగా విత్తనాలు సిద్ధం చేసుకోవడం, భూసార పరీక్షలు నిర్వహించడం, పొలాల్లో తేమ సంరక్షణ చర్యలు చేపట్టడం, నీటి వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని అధికారులు తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా లేదా తక్కువగా కురిసినా ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
సుస్థిరమైన దిగుబడులు సాధించాలి..
ఈ ప్రణాళిక ద్వారా రైతులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకొని, పంట నష్టాలను నివారిస్తూ స్థిరమైన దిగుబడులు సాధించేందుకు అవకాశం కలుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. రైతులు తమ సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించి సాంకేతిక సూచనలు పొందాలని కోరారు.
స్వల్పకాలిక రకాల సాగు మేలు
వర్షాలు తక్కువగాపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న సందర్భంగా రైతులు స్వల్పకాలిక రకాల పంటల సాగుపై దృష్టి సారించాలి. కంది, పెసర, మినుములు, బొబ్బెర, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు లాంటి స్వల్పకాలిక రకాల సాగు మేలు. మూస పద్ధతిలో ఎప్పటికి ఒకేరకం కాకుండా ఆయిల్ పామ్ సాగును పెంచాలి. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.
–ఎస్.విజయచంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి


