ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో వనదేవతల ప్రాంగణంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు మేడారానికి తరలివచ్చి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. తల్లులకు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే గద్దెల వద్ద భక్తుల రాకపోకలు పెరగడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కళకళలాడాయి. భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పసుపు, కుంకుమ, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయశాఖ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అమ్మవార్ల గద్దెల వద్ద దొంగలు చేతివాటం ప్రదర్శించారు. భక్తుల రద్దీని అసరాగా చేసుకుని భక్తుల జేబుల్లోని సుమారుగా రూ. 25వేల నగదు కాజేసినట్లు బాధితులు తెలిపారు. ఈవిషయంపై బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.


