వ్యతిరేక విధానాలతోనే సింగరేణికి నష్టాలు | - | Sakshi
Sakshi News home page

వ్యతిరేక విధానాలతోనే సింగరేణికి నష్టాలు

Jun 8 2026 9:35 AM | Updated on Jun 8 2026 9:35 AM

భూపాలపల్లి అర్బన్‌: కార్మిక వ్యతిరేక విధానాలు, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల వైఫల్యంతోనే సింగరేణి సంస్థ నష్టాలబాట పట్టిందని బీఎంఎస్‌ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జ్‌ కొత్తకాపు లక్ష్మారెడ్డి విమర్శించారు. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీహాల్‌లో ఆదివారం సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘం 29వ ద్వైవార్షిక మహాసభలు నిర్వహించారు. తెలంగాణలోని 12 డివిజన్లకు చెందిన సుమారు 500 మంది ప్రతినిధులు హాజరైన ఈ మహాసభలో లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిథ్యం సంఘం ఐఎన్‌టీయూసీ పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కార్మిక సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపకుండా యాజమాన్యం, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా కార్మిక సమస్యల పరిష్కారానికి సంఘాలు చర్యలు తీసుకోలేదని, సమ్మె పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టించాయని ఆయన మండిపడ్డారు. కార్మిక హక్కుల సాధన, వేతనాల అమలు, కనీస పెన్షన్‌ వంటి అంశాలపై బీఎంఎస్‌ జాతీయస్థాయిలో పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.51,149 కోట్ల విద్యుత్‌ బొగ్గు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 12వ వేజ్‌ బోర్డు అమలుకు సంబంధించి కోల్‌ ఇండియా యాజమాన్యం వెంటనే కమిటీ ఏర్పాటు చేసి నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరారు. మహాసభలో జాతీయ నాయకులు మాధవ్‌నాయక్‌, యాదగిరి సత్తయ్య, సారంగపాణి, వర్షా ఉడికే, భూపాలపల్లి బ్రాంచ్‌ నాయకులు వెలబోయిన సుజేందర్‌, ఆర్‌ నర్సింగ్‌రావు, అల్లం శ్రీనివాస్‌, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

బీఎంఎస్‌ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జ్‌ కొత్తకాపు లక్ష్మారెడ్డి

భూపాలపల్లిలో సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘం మహాసభలు

Advertisement
 
Advertisement
Advertisement