● వెన్నారంలో ఘటన
డోర్నకల్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం డోర్నకల్ మండలం వెన్నారంలో చోటు చేసుకుంది. ఎస్సై ఝాన్సీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయినపల్లి ఆంజనేయులు(35) గార్ల రైల్వే స్టేషన్ పరిధిలో గ్యాగ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పలు కారణాలతో అప్పులపాలైన ఆంజనేయులు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత తన భార్య రాశికి ఫోన్ చేసి ‘ఐ లవ్ యూ రాశి’ అని చెప్పి ఏడుస్తూ ఫోన్ కట్ చేశాడు. దీనిపై అప్రమత్తమైన రాశి విషయాన్ని కుటుంబీకులకు చెప్పగా గ్రామ శివారులో ఆంజనేయులు ఆచూకీ కోసం వెతికారు. రాత్రి 12:40 గంటల సమయంలో మోదుగుచెట్టుకు ఉరేసుకుని కనిపించగా స్థానికులు పరిశీలించడంతో అప్పటికే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య రాశి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఝాన్సీ తెలిపారు.
తీగరాజుపల్లిలో వ్యక్తి ..
సంగెం: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని తీగరాజుపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ అలీ(55), రజియా దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సర్దార్‌పాషా ఉన్నారు. అందరికీ పెళ్లి చేశారు. మహబూబ్ అలీ దంపతులు కొడుకు కోడలితో కలిసి ఉంటున్నారు. కొంతకాలంగా మద్యానికి అలవాటు పడి ఏ పనిచేయకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ నెల 5న బంధువుల పెళ్లికి భార్య రజియా వెళ్లగా మరో గదిలో ఉన్న మహబూబ్ అలీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి గమనించిన కోడలు రుక్సానా పక్కనే ఉన్న యాకూబ్ పాషాకు చెప్పింది. స్థానికులతో కలిసి చూసేసరికి మృతి చెందాడు. మృతుడి భార్య రజియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.


