సంక్షేమానికి చేరువ! | - | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి చేరువ!

Jun 6 2026 12:59 AM | Updated on Jun 6 2026 12:59 AM

జిల్లాలో 40,782 కొత్త రేషన్‌ కార్డులు మంజూరు

ప్రభుత్వ పథకాలకు ఈ కార్డే ప్రామాణికం

ప్రతీ నెల 5,240 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా

మహబూబాబాద్‌: జిల్లాలో అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకున్న తర్వాత అతి తక్కువ సమయంలోనే సంబంధిత అధికారులు రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నారు. కొన్నేళ్ల పాటు కొత్త రేషన్‌కార్డుల మంజూరు జరగలేదు. గత 17 నెలల నుంచి ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని కార్డు పొంది రేషన్‌ బియ్యం ఇతరత్రా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలైన ఆరోగ్యశ్రీ, గృహలక్ష్మి, ఆదాయ సర్టిఫికెట్‌, ఇతరత్రా ప్రయోజనాలు పొందడానికి రేషన్‌ కార్డే ప్రామాణికం కావడంతో పేద, మధ్యతరగతి కష్టాలు తొలగిపోనున్నాయి.

గతంలో 2,40,359 కార్డులు మాత్రమే..

జిల్లాలోని 18 మండలాల్లో 558 రేషన్‌ షాపులు ఉన్నాయి. కాగా, 2024 డిసెంబర్‌ వరకు రేషన్‌ కార్డులు 2,40,359 ఉన్నాయి. ఆ కార్డుల ప్రకారం.. ప్రతీ నెల 4,517 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించి రేషన్‌ షాపులకు సరఫరా చేశారు. ప్రతీ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యాన్ని డీలర్లు పంపిణీ చేస్తున్నారు బయోమెట్రిక్‌, ఐరిష్‌, ఓటీపీ విధానాలతో లబ్ధిదారులకు రేషన్‌ పంపిణీ జరుగుతోంది.

పేదల్లో ఆనందం..

కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయడంతో పేదల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 2025 జనవరి మాసం నుంచి ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు శ్రీకారం చుట్టింది. దీంతో 40,782 కొత్త కార్డులు వాటిలో 1,24,217 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరి కార్డుల మంజూరు పూర్తి చేశారు. పాత కార్డుల్లోని 49,858 కార్డుల్లో కొత్తగా 72,235 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. పాతవి, కొత్త కార్డులు కలిపితే జిల్లాలో 18 మండలాలు ఉండగా.. ఈ శాఖ పరంగా 16 మండలాలు (పాత మండలాల లెక్క ప్రకారం) వాటి పరిధిలో 558 రేషన్‌ షాపులు ఉండగా.. అందులో ఏఎఫ్‌ఎస్సీ కార్డులు 16,812, ఎఫ్‌ఎస్సీ కార్డులు 2,60,854 కార్డులు అన్నపూర్ణ కార్డులు 2 మొత్తం 2,77,668 కార్డులు ఉన్నాయి. అందుకుగాను ప్రతీ నెల 5,240 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించారు.

లబ్ధి పొందాలంటే కార్డు ఉండాల్సిందే..

ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పింఛన్లు ఇతరత్రా పథకాలకు రేషన్‌ కార్డే కీలకం. వాటితో పాటు ఆరోగ్య శ్రీ, ఆదాయం సర్టిఫికెట్‌ ఇతరత్రా వాటికి కార్డు కీలకం. మీసేవ కేంద్రాల్లో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం.. తహసీల్దార్‌ లాగిన్‌కు వెళ్తుంది. ఆతర్వాత జీపీఓలు విచారణ చేసి నివేదిక ఇస్తారు. అనంతరం ఆర్‌ఐలు మరోసారి పరిశీలిస్తారు. తహసీల్దార్‌ చూసి ఆమోదించిన తర్వాత డీసీఎస్‌ఓ లాగిన్‌కు వెళ్తుంది. డీసీఎస్‌ఓ లాగిన్‌లో కార్డు ఆమోదిస్తున్నారు.

అర్హులందరికీ రేషన్‌ కార్డులు..

అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నాం.

జిల్లాలో ఇప్పటివరకు 40,782 కొత్త కార్డులు జారీ చేశాం. ఇది నిరంతర ప్రక్రియ. అర్హులు దరఖాస్తు చేసుకుంటే పౌర సరఫరాల శాఖ అధికారులు విచారణ చేసి కార్డులు ఇస్తారు. – రమేశ్‌, డీసీఎస్‌ఓ

Advertisement
 
Advertisement
Advertisement