గార్ల: దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న పాకాల ఏటిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య వెల్లడించారు. ఈశంకుస్థాపన కార్యక్రమానికి రావాలని శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఉన్నారు.
మానుకోట ఆర్డీఓగా రాజేశ్వరి
మహబూబాబాద్: రాష్ట్రంలోని పలువురు ఆర్డీఓలను బదిలీ చేస్తూ ఆశాఖ సెక్రటరీ లోకేశ్ కుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మానుకోట ఆర్డీఓగా ఎం.రాజేశ్వరిని బదిలీ చేశారు. ఖమ్మంలో జిల్లాలో రాజేశ్వరి ఎస్‌డీసీగా (ఐపీటీ రైల్వేలో) పని చేశారు. మానుకోట ఆర్డీఓగా పని చేసిన కృష్ణవేణిని ములుగు జిల్లాకు బదిలీ చేశారు.
విద్యార్థులకు ఘన స్వాగతం పలకాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లా ఎస్సీ సంక్షేమ హాస్టల్ పునఃప్రారంభం రోజున విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఘన స్వాగతం పలకాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ జిల్లా అధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అభివృద్ధి కార్యాలయంలో జిల్లాలోని హాస్టల్ వార్డెన్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అధికారి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. హాస్టల్‌లో కిటికీలు, తలుపులకు మరమ్మతులు చేయాలని, మరుగుదొడ్లు, వసతి గదులు, వంటశాలలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మంచినీరు, వ్యక్తిగత అవసరాలకు నీరు అందుబాటులో ఉండాలని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వార్డెన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం తరలించేలా చర్యలు తీసుకోవాలి..
దంతాలపల్లి: కొనుగోలు కేంద్రాల్లో మిగిలిన ధాన్యాన్ని త్వరగా తరలించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. మండలంలోని పెద్దముప్పారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మండలంలోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎంత వచ్చింది? ఎంత తరలించారు.. అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం అధికారులకు పలు సూచనలిచ్చారు. తహసీల్దార్ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.
ఐదుగురు గైర్హాజరు..
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఏ.సత్యనారాయణ మూర్తి తెలిపారు. తెలుగు సబ్జెక్ట్ పరీక్షకు 27 మంది విద్యార్థులకు 22 మంది హాజరైనట్లు, ఐదుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. కాగా, ఈ పరీక్షకు సీఎస్, డీఓఎస్, సిట్టింగ్ స్క్వాడ్లు విధులు చేపట్టారు. జిల్లా పరీక్షల విభాగాధికారి మందుల శ్రీరాములు తనిఖీలు చేపట్టారు. మొత్తానికి మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
బైక్ అదుపు తప్పి ఒకరి మృతి
మరిపెడ రూరల్: మరిపెడ మండలం స్టేజి తండాకు చెందిన సింగారపు రవి(38) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం రాత్రి ఓ పని నిమిత్తం తన ద్విచక్రవాహనంపై ఆనెపురం గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో నాగేంద్రస్వామి ఆలయ సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రవి మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రవి మృతి ఘటన తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


