నెహ్రూసెంటర్: మత్స్యకారుల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు, పణ్రాళికల అమలులో జాప్యం జరుగుతోంది. దీంతో వారి జీవనోపాధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. జిల్లాలో చేప పిల్ల ల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, పంపిణీ కోసం ప్రైవేట్ వారిపై ఆధారపడాల్సి వస్తోంది. కాగా, నాణ్యత, కొలతల్లో తేడాలు, సరైన మోతాదులో చేపపిల్లలు రాకపోవడంతో సరైన దిగుబడి లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 1,264 చెరువులు ఉండగా.. ఇందులో గతేడాది సుమారు రెండు కోట్ల చేప పిల్లలను మాత్రమే వదిలారు. కాగా, వరదల కారణంగా చెరువుల కట్టలు తెగిపోయి మత్స్యకారులకు తీవ్ర నష్టం జరిగింది. చేప పిల్లల పంపిణీకి ఈ ఏడాది టెండర్ల పక్రియ ఊసేలేదు.
ఉత్పత్తి కేంద్రాల జాడేది?
జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్ల ల పంపిణే కాకుండా మత్స్యకారులే ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాల్సి ఉంది. మత్స్యకారులే చేప పిల్లల ఉత్పత్తిదారులుగా మారితే ఆర్థికంగా మరింత లబ్ధి జరిగే అవకాశాలున్నాయి. ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నా.. సద్వినియోగం చేసుకునేలా మత్స్యకారులకు అవగాహన లేకపోవడంతో కేంద్రాల ఏర్పాటు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చేపపిల్లల కోసం టెండర్లు ఇవ్వడంతో నాణ్యత ఉండడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చెరువుకు చేరని లక్ష్యం..
జిల్లాలో ఉచిత చేప పిల్లల పథకం ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు. అన్ని చెరువుల్లో సుమారు 4 కోట్ల చేప పిల్లలు వదలాల్సి ఉండగా.. గతేడాది సగానికి తగ్గించి పంపిణీ చేశారు. సరైన సమయం, సరైన మోతాదులో చేప పిల్లలను వదలాల్సి ఉంటుందని, కానీ, ప్రభుత్వం ఏడాది చివరిలో వదలడం వల్ల ప్రయోజనం లేకుండాపోతుందని మత్స్యకారులు చెప్పుకొస్తున్నారు. టెండర్ల ద్వారా కాకుండా సహకార సంఘాలకు నగదు బదిలీ చేయడం ద్వారా నాణ్యమైన పిల్లల్ని కొనుగోలు చేసి వర్షాల ప్రారంభంలోనే చెరువుల్లో వదుకుంటామని మత్స్యకారులు కోరుతున్నారు.
ఊసేలేని ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ..
జిల్లాలో 200 మత్స్యసహకార సంఘాలు, సుమారు 14 వేల మంది మత్స్యకారులు చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గతేడాది సుమారు రెండు కోట్ల చేప పిల్లలను అందించినప్పటికీ వర్షాల కారణంగా చెరువుల కట్టలు తెగి మత్స్యకారులకు తీవ్రనష్టం వాటిల్లింది. కాగా, ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఇంకా ఉచిత చేప పిల్లల పంపిణీ ఊసేలేదు. ఉచిత చేప పిల్లలు కాకుండా నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
మత్స్యకారుల అభివృద్ధిపై దృష్టి సారించని అధికారులు
జిల్లాలో ఏర్పాటు కాని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు
చెరువులకు చేరని పంపిణీ లక్ష్యం
జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం
ఉచిత చేప పిల్లల పంపిణీ
చేపల ఉత్పత్తి


