సంగెం : వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గవిచర్ల గ్రామానికి చెందిన గుళ్లపల్లి రాములు(65) గత మూడు రోజులుగా వీస్తున్న వడగాల్పులకు అస్వస్థతకు గురయ్యాడు. అస్వస్థతకు గురైన రాములును శుక్రవారం ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా మృతి చెందాడు. రాములుకు భార్య భద్రమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
కమలాపూర్: వడదెబ్బతో బోళ్లు విక్రయించే చిరువ్యాపారి శుక్రవారం మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి గ్రామానికి చెందిన బోళ్ల వ్యాపారి పస్తం వినోద్ (31) గ్రామాల్లో తిరిగి బోళ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే వినోద్ గురువారం బోళ్ల వ్యాపారం కోసం గ్రామాలు తిరుగుతున్న క్రమంలో ఎండ వేడిమితో వడదెబ్బకు గురయ్యాడు. ఈక్రమంలో రాత్రి సమయంలో ఇంటి వద్ద భోజనం చేసి పడుకుని తెల్లారే సరికి మృతి చెందాడు. వినోద్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.


