పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

Jun 6 2026 12:59 AM | Updated on Jun 6 2026 12:59 AM

గర్భవతిని చేసిన యువకుడు

అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి

కేసు నమోదు

మహబూబాబాద్‌ రూరల్‌ : ఓ దివ్యాంగురాలైన యువతిని ఓ యువకుడు నమ్మించి వివాహం చేసుకుంటానని చెప్పి గర్భవతి అయ్యాక నిరాకరించడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో మహబూబాబాద్‌ టౌన్‌ పోలీసులు యువకుడిపై అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ మేరకు టౌన్‌ సీఐ రఘుపతిరెడ్డి శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగురాలితో స్థానిక నివాసితుడు నాగేటి రాము పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెతో తరచూ సాన్నిహిత్యంగా ఉంటూ వివాహం చేసుకుంటానని నమ్మబలికి లైంగికంగా లొంగదీసుకున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆమె అనారోగ్యంగా ఉండడంతో స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె వివాహం చేసుకోమని సదరు యువకుడిని కోరగా.. పట్టించుకోకపోవడంతో మోసపోయానని గుర్తించి టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో టౌన్‌ ఎస్సై గడ్డం ఉమ సదరు యువకుడు రాముపై అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

పాఠశాల విద్యాశాఖ

ఆర్జేడీగా మదన్‌మోహన్‌

విద్యారణ్యపురి: వరంగల్‌ పాఠశాల విద్యాశాఖ ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌ (ఎఫ్‌ఏసీ) ఆర్జేడీగా పి.మదన్‌మోహన్‌ శుక్రవారం బాధ్యతులు స్వీకరించారు. హైదరాబాద్‌లోని సమగ్రశిక్షలో జాయింట్‌ డైరెక్టర్‌ –1గా విధులు నిర్వర్తిస్తున్న మదన్‌మోహన్‌ను ఎఫ్‌ఏసీ ఆర్జేడిగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌నికోలస్‌ ఉత్తర్వులు జారీచేయడంతో ఇన్‌చార్జ్‌ ఆర్జేడీగా ఉన్న రంగయ్యనాయుడు నుంచి బాధ్యతలు స్వీకరించారు. వరంగల్‌ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా ఇటీవల హైదరాబాద్‌లోని విద్యాశాఖ ఆర్జేడీ విజయలక్ష్మిని బదిలీ చేశారు. కానీ ఆమె ధీర్ఘకాలిక సెలవులో ఉన్నందున బాధ్యతలు చేపట్టలేదు. ఇక్కడ ఆర్జేడీగా బాధ్యతలను నిర్వర్తించిన సత్యనారాయణరెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. అయితే విజయలక్ష్మి సెలవు ముగించుకొని బాధ్యతలు చేపట్టేవరకు మదన్‌మోహన్‌ ఆర్జేడీగా కొనసాగుతారని నవీన్‌నికోలస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఎఫ్‌ఏసీ ఆర్జేడీగా బాధ్యతలు స్వీకరించిన మదన్‌మోహన్‌ను టీఎన్జీఓ ఫోరం స్కూల్‌ ఎడ్యూకేషన్‌ సెక్రటరీ ఎండీ ఫక్రుద్దీన్‌ అహ్మద్‌, ఉపాధ్యక్షుడు రాయిశెట్టి అశోక్‌ శుక్రవారం కలిసి పూలబోకేను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆఅసోసియేషన్‌ హనుమకొండ జిల్లా సెక్రటరీ రాజేశ్వర్‌, దిలీప్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement