కదలిక వచ్చేనా.. | - | Sakshi
Sakshi News home page

కదలిక వచ్చేనా..

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ డీలా

ఐదు సర్పంచ్‌ స్థానాలు, ఒక్క మున్సిపల్‌ వార్డుకే పరిమితం

సభ్యత్వం ఉన్నా.. ఓటు బ్యాంకు లేని పరిస్థితి

నేటి నుంచి జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులు

సాక్షి, మహబూబాబాద్‌:

దేశంలో ప్రధానమంత్రి మోదీ ప్రభంజనం కొనసాగుతోంది. ఈమేరకు అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర అధినాయకత్వం పదేపదే చెబుతున్నా.. జిల్లా కమలనాథుల్లో మాత్రం చలనం రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో పార్టీకి కాయకల్ప చికిత్స అందించి కార్యకర్తల్లో కదలిక తీసుకువచ్చేందుకు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే పార్టీ శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు రానున్నారు. అలాగే ముగింపు సమావేశానికి ఎంపీ ఈటల రాజేందర్‌ వచ్చి దిశానిర్దేశం చేయనున్నారు.

ఉనికి కాపాడుకోవడంలో..

జిల్లాలో ఉభయ కమ్యూనిస్టు, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు బలంగా ఉన్నా.. భారతీయ జనతా పార్టీ కూడా తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో బీజేపీకి 26వేలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్‌లో 13వేల మేరకు ఓట్లు సాధించగా.. డోర్నకల్‌ నియోజకవర్గంలో మాత్రం 3,800 ఓట్లకే పరిమితమైంది. ఈ ఫలితాలను చూసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్ఘాంతపోయారు. కనీసం సభ్యత్వం ఉన్నవారు కూడా ఓటు వేయని పరిస్థితి ఉందనే చర్చ జరిగింది. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదని పార్టీ కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేశారు. అదే విధంగా పంచాయతీ ఎన్నికల్లో ఐదు సర్పంచ్‌ స్థానాలు, 11 ఉప సర్పంచ్‌లు, మరో 50 మంది మేరకు వార్డు సభ్యులు గెలిచారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక వార్డు కౌన్సిలర్‌ గెలుపొందారు. అయితే ఈ గెలుపు కార్యకర్తల కష్టానికి ఫలితమే అని.. పార్టీ జిల్లా నాయకులు ఎవరు కూడా సరైన మద్దతు తెలపలేదని కార్యకర్తలు ఆరోపించారు.

ఎవరికి వారుగా..

క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మానుకోట బీజేపీలో ఎవరికి వారు యమునా తీరు అన్నట్లు మారిందని కార్యకర్తలు, సీనియర్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ గతంలో పార్టీని ఒక్కతాటిపై నడిపించారని, ఆయన ఢిల్లీకి వెళ్లిన తర్వాత పార్టీకి పెద్దదిక్కు కరువయ్యారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ నాయకులతో పాటు యువత కూడా వర్గాలుగా విడిపోయి ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ ప్రభావం తగ్గుతుందనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పలువురు కార్యకర్తలు చందాలు వసూళ్లు చేయడం తమను బాధిస్తుందని పార్టీలోని ఓ సీనియర్‌ నాయకుడు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఇటువంటి పరిస్థితిలో జిల్లాలో నిర్వహించే పార్టీ శిక్షణ తరగుతుల్లో అనేక విషయాలు చర్చకు రావాలని, కార్యకర్తల్లో ఈ శిక్షణ ఉత్సాహాన్ని నింపాలని పార్టీ అభిమానులు, సీనియర్‌ నాయకులు కోరుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement