మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, మొత్తం 97మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల మధ్య పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రం వద్ద జిరాక్స్ సెంటర్లకు అనుమతి లేదని, 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ నాగలక్ష్మి, డీఈఓ సత్యనారాయణమూర్తి, ఏసీజీఈ మందుల శ్రీరాములు, సెక్షన్ ఇన్‌చార్జ్ శ్రీకాంత్ తదితరలు పాల్గొన్నారు.


