● అగ్ని ప్రమాదాలతో
ఉద్యాన పంటలకు నష్టం
● నివారణ చర్యలతోనే రైతులకు భరోసా
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో అగ్ని ప్రమాదాలతో ఉద్యాన పంటలకు తీరని నష్టం వాటిల్లుతోందని ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అగ్ని ప్రమాదాల బారినుంచి ఉద్యాన పంటలు, బిందు సేద్య పరికరాలను రక్షించుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఏటా ప్రమాదాలు..
జిల్లాల ఏటా ఆయిల్‌పామ్, మామిడి, సపోటా, నిమ్మ, బొప్పాయి, అరటి తదితర తోటల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే బిందు సేద్య పరికరాలు కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోతున్నాయి. ముఖ్యంగా పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగి ఆర్థికపరమైన నష్టం జరుగుతోంది. యాజమాన్య పద్ధతులు పాటించకుండా వదిలేసిన తోటలు అగ్ని ప్రమాద బారిన పడుతున్నాయి. పూల పొదలతో ఉండే పలురకాల గడ్డిజాతి కలుపు మొక్కలు బాగా పెరిగి అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
నివారణ చర్యలు..
● తోట చుట్టూ ఫైర్ లైన్ ఏర్పాటు చేసుకోవాలి.
● ఆరు అడుగుల దూరంతో చుట్టూ ఎలాంటి ఎండిన ఆకులు, ఇతర వాటిని లేకుండా తీసివేయాలి.
● పాదులలో తేమ ఉండేలా చూసుకోవాలి.
● మల్చింగ్ చేయాలి, బిందు సేద్యం ద్వారా నీరు పెట్టాలి.
● ఎప్పటికప్పుడు కలుపును నివారించాలి.
● చెట్లకు ఉన్న పిచ్చి తీగలు, పిచ్చి దొండ తీగలు, ఎండు మండలు, కొమ్మలు, ఎండు పుల్లలు ఒకటి రెండు వర్షాల తరువాత తొలగించాలి.
● అడ్డదిడ్డ కొమ్మలు, గొడుగు కొమ్మలను కూడా వర్షాకాలంలో తొలగించాలి.
● ఫ్రూనింగ్, కొమ్మ కత్తిరింపులు చర్యలు తీసుకోవాలి.
● అంతర పంటలు సాగు చేయాలి.
● ఎండు ఆకులు, ఇతర వ్యర్థాలను డీకంపోజర్‌తో కుళ్ల్లిపోయే విధంగా చేయాలి.
● పశు గ్రాసం పెంచాలి.
● కూరగాయపంటలు సాగు చేయాలన్నారు.
● శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి.
కలుపు లేకుండా చూసుకోవాలి
రైతులు మామిడి, ఆయిల్ పామ్ తోటల్లో ఎప్పటికప్పుడు యాజమాన్య పద్ధతులు పాటించి కలుపు లేకుండా చూసుకోవాలి. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల చుట్టుపక్కల ఉన్న తోటలకు ఆ మంటలు వ్యాప్తి చెంది తీరని నష్టం వాటిల్లుతుంది. తోటల్లో బయట, లోపల పరిశుభ్రంగా ఉంచుకుంటే అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉంటాయి. పంట వ్యర్థాలను కాల్చకుండా ఉంటే రైతులకు ఉపయోగకరం.
– జినుగు మరియన్న,
జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి
ఆయిల్ పామ్ 8,962 ఎకరాలు
మామిడి 13,542 ఎకరాలు
మిర్చి 30,839 ఎకరాలు
కూరగాయలు, అరటి,
జామ, బొప్పాయి, నిమ్మ, పూలు,
మల్బరీ పంటలు : 6,161 ఎకరాలు


