అర్హులందరికీ సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : గ్రామాలు, పట్టణాల్లోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్‌ పురుషోత్తం అన్నారు. మహబూబాబాద్‌ మండలంలోని నడివాడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు గురువారం అదనపు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాలు, తండా గ్రామపంచాయతీల్లో పచ్చదనం, పరిశుభ్రత విషయంలో ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలన, గంజాయి మాదకద్రవ్యాల రవాణా, వాడకంపై సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి నగదు ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరు సమాజాభివృద్ధికి కృషి చేసి గ్రామాలు ఆదర్శవంతంగా తయారయ్యేలా సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిర్దేశించిన మేరకు ఓటరు జాబితా సవరణకు ప్రజలు సహకరించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవఓ రఘుపతిరెడ్డి, తహసీల్దార్‌ చంద్రరాజేశ్వరరావు, ఏఓ తిరుపతిరెడ్డి, సీడీపీఓ శిరీష, సర్పంచ్‌ మైదం విజయ్‌ కుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

అడవుల రక్షణతోనే మానవ మనుగడ

బయ్యారం: అడవుల రక్షణతోనే మానవుల మనుగడ సాధ్యమని జిల్లా అటవీశాఖ అధికారి బి.విశాల్‌ అన్నారు. బయ్యారంలోని రైతువేదికలో ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం వనసంరక్షణ సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎస్‌ఎస్‌ సభ్యులకు అడవులు, వన్యప్రాణుల రక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం డీఎఫ్‌ఓ మాట్లాడారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ వెంకటేశ్వర్లు, ఎఫ్‌ఆర్‌ఓ రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉక్కపోత నుంచి ఉపశమనం

తొర్రూరు: ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలు గురువారం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. తొర్రూరు పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కాగా, ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకపోవడం, వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడిసి నష్టపోతామనే భయం రైతుల్లో నెలకొంది.

డీటీఓగా శంకర్‌ బాధ్యతల స్వీకరణ

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా రవాణాశాఖ అధికారి(డీటీఓ)గా బి.శంకర్‌ గురువారం బాధ్యతులు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న జయపాల్‌రెడ్డి డీటీసీ నుంచి కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. కొమురంభీం ఆసిఫాబాద్‌ నుంచి డీటీఓ శంకర్‌, హనుమకొండ నుంచి ఏఎంవీఐ బి.విజయశాంతి, మంచిర్యాల నుంచి ఏఎంవీఐ షేక్‌ కాసీం బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు.

ఉమ్మడి రైల్వేల స్టేట్‌ ట్రైనింగ్‌ కమిషనర్‌గా ఏలియా

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌లో సీనియర్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఎర్ర ఏలియా ఉమ్మడి రైల్వేలు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, సౌత్‌ కోస్ట్‌ రైల్వే భారత్‌ స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ స్టేట్‌ ట్రైనింగ్‌ కమిషనర్‌గా ఇటీవల నియమితులయ్యారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లో భారత్‌ స్కౌట్‌ అండ్‌ గైట్స్‌ స్టేట్‌ సెక్రటరీ శేఖర్‌బాబు చేతుల మీదుగా నియామకపత్రం స్వీకరించినట్లు ఏలియా గురువారం స్థానిక విలేకర్లకు తెలిపారు. ఏలియా నియామకం పై స్థానిక స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌, రైల్వే అధికారులు, నాయకులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement