రాజకీయాలకతీతంగా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలకతీతంగా అభివృద్ధి

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

మహబూబాబాద్‌: రాజకీయాలకతీతంగా మానుకోట మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం కౌన్సిల్‌ సాధారణ సమావేశాన్ని చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆదర్శంగా మారుస్తామన్నారు. కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయించాలన్నారు. ఇందరిమ్మ ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యం ఉండొద్దన్నారు. మహిళలకు భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూడాలన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు అధికారులు పరిష్కరించాలన్నారు.

మీడియాకు అనుమతి నిరాకరణ..

సీపీఐ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల నిరసన..

కౌన్సిల్‌ సాధారణ సమావేశానికి కమిషనర్‌ మీడియాకు అనుమతించకపోవడంపై సీపీఐ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. రూ.59 కోట్ల అభివృద్ధి నిధుల విషయంలో అధికారపక్షాన్ని నిలదీశారు. ఈసందర్భంగా సీపీఐ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అజయ్‌సారథి రెడ్డి మాట్లాడుతూ.. కూరగాయల మార్కెట్‌ను వినియోగంలోకి తేవాలన్నారు. ఆఫీసర్‌ క్లబ్‌ స్థలాన్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయాలన్నారు.

వాగ్వాదం..

పట్టణంలో పేరుకుపోయిన పలు సమస్యలపై పలువురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లతో బీఆర్‌ఎస్‌, సీపీఐ కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా అధికారులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. పలువురు కౌన్సిలర్లు సమస్యలపై మాట్లాడారు.

ఎజెండాలో 161 అంశాలు..

కౌన్సిల్‌ సమావేశానికి కమిషనర్‌ మీడియాకు అనుమతించలేదు. పాత్రికేయులు కారణాలు అడుగగా.. అనుమతి లేదని జీఓ ఉందని బదులిచ్చారు. సమావేశంలో చర్చించిన అంశాలు ప్రజలకు ఎలా తెలియాలని ప్రశ్నించగా.. మున్సిపల్‌ అధికారులు ఏది రాసిస్తే అది రాయండి అని కమిషనర్‌ సమాధానం ఇచ్చారు. కాగా, ఎజెండాలోని 161 అంశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. వైస్‌ చైర్మన్‌ సూర్నపు సోమయ్య, కమిషనర్‌ వినోద్‌ కుమార్‌, డీఈ ఉపేందర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మానుకోట మున్సిపల్‌ కౌన్సిల్‌

సాధారణ సమావేశంలో

ఎమ్మెల్యే మురళీనాయక్‌

మీడియాకు అనుమతి ఇవ్వని కమిషనర్‌

సీపీఐ, బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన

Advertisement
 
Advertisement
Advertisement