పంట మార్పిడితో ఆర్థికాభివృద్ధి సాధించండి | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడితో ఆర్థికాభివృద్ధి సాధించండి

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

గూడూరు: పంట మార్పిడి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. మండలంలోని అప్పరాజ్‌పల్లి, పడమటితండా గ్రామాల్లో గురువారం ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలకు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయంలో మార్పు తీసుకొచ్చేందుకు ఖేత్‌ బచావో అభియాన్‌ అనే కార్యక్రమంతో రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎప్పుడు ఒకేరకమైన పంటల సాగు చేయకుండా.. మార్పిడి చేస్తూ ఉండాలన్నారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సూచించారు. పంట మార్పిడితో భూసారం పెరుగుతుందన్నారు. అన్ని రకాలుగా వ్యవసాయంలో మార్పు కనిపించి, దిగుబడులు పెరిగి, ఖర్చు తగ్గి లాభం వస్తుందన్నారు. వరి తర్వాత పప్పు ధాన్యాల సాగు చేయాలని తెలిపారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చొద్దని, దీని వల్ల పర్యావరణం కలుషితం కావడమే కాక, నేలకు అనర్థాలు కలుగుతాయన్నారు. పడమటితండా జీపీలో గ్రామసభ అనంతరం జనగణన కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలు, జనాభా ఎంత అనే విషయం తెలుసుకున్నారు. తండావాసులతో జనగణనపై అడిగి తెలుసుకుంటూ, ఓ బాలిక కనిపించగా, ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, శ్రద్ధగా చదువుకోవాలని సూచించగా.. ఒకే మేడం గారూ అంటూ సమాధానం ఇచ్చింది. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఏఓ అబ్దుల్‌మాలిక్‌, తహసీల్దార్‌ నాగభవాని, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ పృథ్వీరాజ్‌, ఎస్సై గిరిధర్‌రెడ్డి, ఏఎస్‌ఓ సుమలత, అప్పరాజ్‌పల్లి సర్పంచ్‌ భరత్‌, పడమటితండా సర్పంచ్‌ భాస్కర్‌, రైతులు పాల్గొన్నారు.

‘బడిబాట’ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి

మహబూబాబాద్‌: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి గురువారం కలెక్టర్‌ స్నేహశబరీష్‌ జిల్లాలోని 18మండలాల ఎంపీడీఓలు, ఏంఈఓలతో విద్యపై వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విధంగా అవగాహన కల్పించాలన్నారు. నూతన టెక్నాలజీ ద్వారా బోధన అందిస్తున్నామన్నారు. విద్యతోపాటు క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement