● డీఏఓ ఎస్.విజయచంద్ర
మహబూబాబాద్ రూరల్ : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డీఏఓ ఎస్.విజయచంద్ర హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల డీలర్లతో విత్తన విక్రయాలపై వ్యవసాయశాఖ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను బిల్లుతో విక్రయించాలని సూచించారు. డీలర్లు వ్యవసాయ శాఖ జారీ చేసిన సీడ్ లైసెన్స్‌లను ధ్రువీకరించుకోవాలన్నారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, స్టాక్ బోర్డు, ధర పట్టికలను షాపుల్లో ఏర్పాటు చేయాలని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్మితే డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల క్రయవిక్రయాలను ఈపాస్ మిషన్‌లో నమోదు చేయాలని, ఈపాస్ మిషన్ ద్వారా మాత్రమే రైతులకు విక్రయించాలన్నారు. ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, టౌన్, రూరల్ సీఐలు రఘుపతిరెడ్డి, అంజలి, రూరల్ ఎస్సై రవికిరణ్, టెక్నికల్ ఏఓ రాంజీనాయక్, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, మండల డీలర్ల అధ్యక్షుడు వక్కల శ్రీనివాస్, విత్తన, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.


