నకిలీ విత్తనాలపై కఠినంగా ఉన్నాం
గతంలో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఇందుకోసం ప్రత్యేక టీమ్ వేశాం. రైతులు మాయమాటలకు మోసపోవద్దు. లైసెన్స్ ఉన్న షాపులోనే విత్తనాలు, ఎరువులు కొనాలి. ప్రతీ కొనుగోలుకు రశీదు తీసుకోవాలి. అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. రైతులను మోసం చేసే పని ఎవరూ చేసినా సహించేది లేదు.
– శబరీష్, ఎస్పీ, మహబూబాబాద్
మొదలైన నాసిరకం విత్తనాల విక్రయదందా
●
సాక్షి, మహబూబాబాద్: అలుపెరుగని శ్రమ రైతులది. పంటలు పండినా.. ఎండినా.. లాభం వచ్చి నా.. రాకపోయినా అప్పటికప్పుడే మర్చిపోతారు. మరుసటి ఏడాది వ్యవసాయం చేసేందుకు సిద్ధం అవుతారు. ఈమేరకు ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నడం, సేంద్రియ ఎరువులు(పశువుల పేడ) తోలడం, గొర్రెలు, బర్రెల మందలు పెట్టిస్తున్నారు. దీంతోపాటు విత్తనాలు సిద్ధం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కాగా, గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జిల్లా రైతులు విత్తనాలు కొనా లంటేనే భయపడుతున్నారు. విత్తన కొనుగోళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు తెలియక సతమతమవుతున్నారు.
విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో..
ఈ వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 4,77271 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అంచనాకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈమేరకు 58,790 క్వింటాళ్ల వరి విత్తనాలు, 5,900 క్వింటాళ్ల మొక్కజొన్న, 2,66,666 ప్యాకెట్ల పత్తి, 388 క్వింటాళ్ల మిర్చి, 168 క్వింటాళ్ల పప్పుదినుసుల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. ఈ విత్తనాలు సేకరించే పనిలో అన్నదాతలు నిమగ్నమయ్యారు.
అదే భయం..
జిల్లాలో గతంలో జరిగి సంఘటనలు తలచుకుంటూ.. విత్తనాలు కొనేందుకు రైతులు భయపడుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం మహబూబాబాద్ పట్టణంలో నకిలీ పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేస్తూ అడ్డంగా దొరికారు. కరోనా సమయంలో ఒక దుకాణంలో క్వింటాళ్లకొద్ది నకిలీ పత్తివిత్తనాలు దొరికిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నకిలీ మొక్కజొన్న, వరి విత్తనాలు కొని మోసపోయామని రైతులు జిల్లా కేంద్రంలోని విత్తన విక్రయ షాపు ముందు కాత పూతలేని పంటలను పట్టుకొని ధర్నా చేశారు. నకిలీ మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేయడంతో సరైనపంట రాలేదని పలువురు రైతులు విత్తన కంపెనీలపై ఆరోపణ చేస్తూ వినియోగదారుల ఫోరంను సంప్రదించారు. అలాగే మిర్చి తోటలు దిశ మార్చి కాపునకు వచ్చిందని రైతులు ఆందోళన చేశారు. ఇవే కాకుండా 2023లో బీటీవిత్తనాలు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. 2024లో జిల్లాకు వచ్చిన జీలుగు విత్తనాల సబ్సిడీని కాజేసేందుకు ఆంధ్రాప్రాంతానికి అమ్మారనే ఆరోపణలపై ఏఓ, ముగ్గురు ఏఈఓలను సస్పెండ్ చేశారు. ఐదు విత్తన విక్రయషాపుల లైసెన్స్ రద్దు చేశారు.
జిల్లా సరిహద్దుల్లోనే..
మహబూబాబాద్ జిల్లాకు ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి. ఇందులో సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు సమీపంలో ఉన్నాయి. దీంతో నకిలీ విత్తనాల విక్రయాల ముఠా సునాయసంగా జిల్లాకు వచ్చి రైతులకు మాయమాటలు చెప్పి అమ్ముకొని పోతున్న సంఘటనలు బయట పడ్డాయి. ఈ సీజనల్‌లో కూడా నకి లీ విత్తనాల విక్రయాల అమ్మకాలు మొదలయ్యాయనే ఆరోపణలు రావడం.. పోలీసులు పలువురిని పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.
సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువ
గతంలో మోసపోవడంతో రైతుల బెంబేలు
జిల్లాలోని విత్తన షాపుల తనిఖీ


