ఇద్దరు గిరిజన మహిళల అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు గిరిజన మహిళల అనుమానాస్పద మృతి

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

మరిపెడ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాలో మంగళవారం రాత్రి ఇద్దరు గిరిజన మహిళల అనుమానాస్పద మృతి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. స్నేహితురాళ్లయిన మాలోతు శారద (40), మాలోతు నీల (42) ఒకే మద్యం బాటిల్‌లోని మద్యం సేవించి అనంతరం అస్వస్థతకు గురై మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం మాలోతు శారద తన కుమారుడు తిరుపతితో కలిసి సూర్యాపేటలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో సూర్యాపేటలోనే ఒక బీరు, ఓ బ్రాండ్‌ క్వార్టర్‌ బాటిల్‌ మద్యాన్ని కొనుగోలు చేసింది. కుమారుడు బీరు సేవించగా, శారద కొంత మద్యం తాగి మిగిలినదాన్ని ఇంటికి తీసుకువచ్చింది. మంగళవారం సాయంత్రం స్నేహితురాలైన నీలతో కలిసి మిగిలిన మద్యాన్ని తాగారు. ఇద్దరు మాట్లాడుకుంటున్న క్రమంలో కొద్ది సేపటికే అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు మొదట ఇద్దరికి చెడుగాలి సోకిందేమోనని ఓ ఆటోలో స్థానిక భూత వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడినుంచి కురవి మండలం చింతపల్లిలోని మరో భూత వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో 108 వాహనంలో మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు నిర్ధారించారు.

విష ప్రయోగం కోణంలో అనుమానాలు

ఇద్దరు మహిళలు ఒకే మద్యం సేవించిన అనంతరం అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడంతో మద్యంలో విషపదార్థం ఏమైనా కలిసిందా? లేక కల్తీ మద్యం కారణమా? అనే అనుమానాలు వారి ఇరువురి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం మరో కోణంలో వడదెబ్బగా భావిస్తున్నారు. మద్యం సేవిస్తున్న క్రమంలో మాలోతు నీలకు సన్‌స్ట్రోక్‌ వచ్చి అపస్మారక స్థితిలో పడిపోగా మరో మహిళ మాలోతు శారద భయంతో బీపీ పెరిగిపోయి ఇద్దరు మృత్యువాత పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మృతుల ఇళ్లలో వరుస విషాదాలు..

శారద భర్త బాబురావు ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించగా, ఆమె ఇద్దరు కుమారులతో ఉన్నారు. మరోవైపు నీల చిన్నకుమారుడు లోకేశ్‌ మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రస్తుతం భర్త భావ్‌సింగ్‌, కుమారుడు వెంకటేష్‌ ఉన్నాడు. ఒకే తండాకు చెందిన ఇద్దరు మహిళ స్నేహితులు మృత్యువులోని వారి స్నేహబంధం వీడలేదని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.

పోలీసుల దర్యాప్తు..

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మరిపెడ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిగిలిన మద్యాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్‌ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే వారి మరణాలకు అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

విష ప్రయోగమా..? కల్తీ మద్యమా..

వడదెబ్బ వల్లనా..

మరేమైనా కారణమా..?

దర్యాప్తు చేస్తున్న మరిపెడ పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement