ఆస్తి కోసం తమ్ముడిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం తమ్ముడిపై హత్యాయత్నం

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

పాలకుర్తి టౌన్‌: భూవివాదం, తగాదాల నేపథ్యంలో సొంత తమ్ముడిని చంపడానికి ఓ అన్న సుపారీ ఏర్పాటు చేసి హత్యాయత్నం చేయించాడు. ఈ కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. బుధవారం పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య వెల్లడించారు. పాలకుర్తి మండలంలోని శాతాపురం గ్రామానికి చెందిన తీగల ధర్మారావు స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంలో ఎస్‌బీఐ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిపై అతడి అన్న కిషన్‌రావు కన్నేశాడు. ధర్మారావుకు సంతానం లేకపోవడంతో అతడి అడ్డు తొలగిస్తే భూమి తమ సొంతమవుతుందని భావించాడు. అన్న కిషన్‌రావు కుమారుడు కిరణ్‌ తన స్నేహితుడు గీతేశ్వర్‌ ద్వారా రూ.15 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకుని హత్యకు డీల్‌ కుదుర్చుకున్నాడు. రూ.25వేలు అడ్వాన్స్‌, షూరిటీ కింద కిరణ్‌ భూమి పత్రాలు, ఖాళీ చెక్కులు, ఖాళీ బాండ్‌ పేపర్లు తీసుకున్నారు. సుపారీ గ్యాంగ్‌ సోనుతో పాటు తూముల గీతేశ్వర్‌, ద్వాప సంజయ్‌, కసప్‌ శ్రీకాంత్‌, వేముల హర్షిత్‌తో కలిసి ధర్మారావు కదలికలపై మూడుసార్లు స్టేషన్‌ ఘన్‌పూర్‌, పాలకుర్తి ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. మే 27న రాత్రి పనులు ముగించుకొని ధర్మారావు 9గంటల సమయంలో పాలకుర్తి చేరుకున్నాడు. అప్పటికే కారులో మాటువేసిన సుపారీ గ్యాంగ్‌ నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ధర్మారావును కత్తితో కడుపు, వీపు, ఛాతిపై విచక్షణరహితంగా పొడిచారు. అటువైపు జనం వస్తుండడంతో భయపడిన నిందితులు కారులో పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ధర్మారావును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై ఽధర్మారావు భార్య తీగల మౌనిక ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. హత్యాయత్నానికి అతడి సోదరుడు కిషన్‌రావు, అతడి కుమారుడు కిరణ్‌తో కొనసాగుతున్న భూతగాదాలే కారణమని పోలీసులు తేల్చారు. హత్యకు స్కెచ్‌ వేసిన కిషన్‌రావు, కిరణ్‌తో పాటు ఘటనలో పాలొన్న సుపారీ గ్యాంగ్‌ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి కత్తి, కారు, భూపత్రాలు, చెక్కులు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు త్వరితగతిన ఛేదించిన సీఐ జానకీరాంరెడ్డి, ఎస్సై పవన్‌ కుమార్‌, ఐడీ అసిస్టెంట్‌ అనలిస్ట్‌ సల్మాన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ గోలి సోమిరెడ్డి, పోలీస్‌ సిబ్బంది రమేశ్‌, రాజ్‌కుమార్‌, రవి, సురేశ్‌, యాకయ్య, ప్రశాంత్‌లను ఏసీపీ నర్సయ్య అభినందించారు.

సుపారీ గ్యాంగ్‌తో

సోదరుడి ఒప్పందం

గత నెల 27న కత్తితో దాడి..

కోలుకుంటున్న బాధితుడు

ఆరుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement