గీసుకొండ: ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని గృహ ప్రవేశం చేసిన మరుసటి రోజే ఆ పేదింటి కుటుంబంలో విషాదం నెలకొంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ హవేలి గ్రామానికి చెందిన కట్ట సునీత(38) పాముకాటుతో మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట సునీత, దేవేందర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూలీ పని చేస్తూ జీవనం కొనసాగించే వారు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నారు. గత నెల 29న గృహ ప్రవేశం చేసి ఇంట్లోలోనే నిద్రించారు. మిగిలిన అన్నం గిన్నెను బయట పెట్టడానికి మరుసటి రోజు(30వ తేదీన) ఉదయం సునీత బయటకు వచ్చి కుప్పగా పోసిన ఇటుకల వద్దకు వెళ్లగా అక్కడ ఉన్న పాము కాటేసింది. దీంతో ఆమెను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి భర్త దేవేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.
● గృహప్రవేశం చేసిన
మరుసటి రోజే ఘటన..


