నాలుగు అంశాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి, మహబూబాబాద్: అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి సారథ్యంలో ఆదర్శ పాలన అందిస్తున్నామని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సంక్షేమ రంగాలకు పెద్దపీట..
పేద కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని విప్ రాంచంద్రు నాయక్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో శాఖల వారీగా పురోగతి సాధించిన అంశాలను ప్రజల ముందు ఉంచామని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడత 2,576 ఇళ్లు పూర్తి చేశామని అన్నారు. రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రెవెన్యూ పాలసీ అమలుకు కొత్త సర్వేయర్లను నియమించామని అన్నారు. జిల్లా ఆస్పత్రి, పీహెచ్‌సీల ద్వారా ప్రజల వద్దకు ప్రభుత్వ వైద్యం తీసుకొచ్చామని చెప్పారు. జేఎన్‌టీయూ ద్వారా ఇంజనీరింగ్ విద్య, ఉద్యానకళాశాల ఇలా అనేక సంస్థలు స్థాపించి పేదల ముంగిటికి పెద్ద చదువులు తీసుకొచ్చామని అన్నారు. భూభారతి దరఖాస్తులు స్వీకరించి 30,559 మంది దరఖాస్తులు పరిశీలించామని, సాదాబైనామా ద్వా రా 4,571 దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. రైతు భరోసా, రైతు బీమా అమలు, మద్దతు ధరతో ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేశామని చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 34,623 కొత్త రేషన్ కార్డులు అందజేశామని, మహిళా సాధికారత కోసం, గ్రామీణ, పట్టణ మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాలు అందిస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా విద్యార్థులకు మెరుగైన వసతులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని విప్ వివరించారు. ఉచిత చేపపిల్లల పంపిణీ, జీవాలకు టీకాలు, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ మొదలైన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
మరింత బలోపేతం..
అభివృద్ధి, సంక్షేమమే కాకుండా ప్రజలకు రక్షణ కల్పించడంలో మెరుగైన పోలీస్ వ్యవస్థ అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు క్షేత్రస్థాయి నుంచి నిఘా పెంచామని చెప్పారు. యుమత మత్తుకు బానినకాకుండా చూడడం, ఇప్పటికే బానిసైన వారికి డీ–అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నామని అన్నారు. రాత్రి గస్తీ, వాహనాల తనిఖీ, చెక్‌పోస్టుల ద్వారా నేరాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకోసం షీ–టీమ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమరంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్లు అనిల్ కుమార్, పురుషోత్తం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్న ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్,
ఎమ్మెల్యే మురళీ నాయక్, కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్, సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్న విద్యార్థినులు
పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం
ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్
ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
సుపరిపాలన..
తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయని విప్ అన్నారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్‌ఫ్రాడెవలప్‌మెంట్, పారదర్శక సుపరిపాలన ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకొని ముందుకు వెళ్తున్నామని అన్నారు. వెల్ఫేర్ అండ్ సోషల్ జస్ట్టీస్ పాలసీ, గ్రీన్‌ఎనర్జీ పాలసీ, ఇన్‌ఫ్రా అండ్ ఇండస్ట్రీ, టూరిజం పాలసీలను సిద్ధం చేశామని చెప్పారు.


