గార్ల: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎంట్రన్స్ ఫలితాల్లో మండలంలోని మూడ్‌తండాకు చెందిన మూడ్ తనయ్ ఆలిండియా ఎస్టీ విభాగంలో 28 వ ర్యాంకు సాధించారు. నందూలాల్–విజయలక్ష్మి దంపతుల కుమారుడు తనయ్ మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియాలో ఎస్టీ విభాగంలో 28వ ర్యాంకు సాధించగా.. స్థానికులు అభినందించారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించడానికి 76 పాఠశాలలకు అనుమతులు వచ్చాయని, ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పోస్టుకు కనీస విద్యార్హత 7వ తరగతి ఉండాలని, స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉండాలని, ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు కనీస విద్యార్హత ఇంటర్ ఉండాలన్నారు. బాల్య విద్య, ప్రాథమిక బోధనలో అర్హతలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు వారు అర్హులని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుందన్నారు. బోధకులకు నెలకు రూ.8వేల గౌరవ వేతనం, ఆయాకు రూ.6వేల గౌరవ వేతనం 10 నెలలు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 3నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తులు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ తెలిపారు.
బ్యాంకు డిపాజిట్ల సొమ్ము గల్లంతు ?
కురవి: మండలంలోని ఓ బ్యాంకులో డిపాజిట్ల సొమ్మును ఆ బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి బినామీ ఖాతా ఓపెన్ చేసి బదిలీ చేసుకున్నట్లు తెలిసింది. సుమారు రూ.3.50కోట్లు బినామీ ఖాతాలోకి మళ్లించి ఆ ఉద్యోగి వాడుకున్నట్లు సమాచారం. ఈ విషయమై బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి కురవి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈమేరకు కేసు నమోదు చేసి విచారణ చేసినట్లు ప్రచారం. బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బులు దుర్వి నియోగం అయినట్లు నిర్ధారించిన పోలీసులు సదరు ఉద్యోగిని అరెస్టు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ నిధుల దుర్వినియోగం వెనుక ఆ ఉద్యోగి ఒక్కరే ఉన్నారా? లేదా మరెవరైనా ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది.
బాధ్యతల స్వీకరణ
గూడూరు: గూడూరు ఫారెస్టు రేంజ్ అధికారిగా జి.ప్రసాదరావు సోమవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు.
భద్రాచలానికి బస్సు నడపాలి
డోర్నకల్: డోర్నకల్ మీదుగా భద్రాచలానికి ఆర్టీసీ బస్సు సర్వీసు నడపాలని బీజేపీ నియోజకవర్గ నాయకుడు నరేష్‌నాయక్ కోరారు. మంగళవారం మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్‌గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వద్దిరాజు రాంచందర్‌తో కలిసి డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందించారు.
ఏనుమాముల మార్కెట్ చైర్‌పర్సన్‌గా ప్రియాంక
ఖిలా వరంగల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మూడేళ్లుగా ఖాళీగా ఉన్న వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీకి మంగళవారం నూతన పాలకవర్గాన్ని ప్రకటించింది. చైర్ పర్సన్‌గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్‌గా బండి జనార్దన్‌ను నియమించినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెట్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. వరంగల్ మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిందని పేర్కొన్న ఆయన నూతన పాలకవర్గం స్థానిక రైతుల సమస్యల పరిష్కారంలో చురుకై న పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.


