● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖ దేశంలోనే అత్యుత్తమ పోలీసు వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని, అదే స్ఫూర్తితో అందరూ ముందుకుసాగాలని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తూ, తెలంగాణ పోలీసుల ప్రతిష్టను మరింత పెంచేందుకు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పతకాలు, సేవా పతకాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, పతకాల గ్రహీతలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


