అభివృద్ధి పుష్కలం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పుష్కలం

Jun 2 2026 5:41 AM | Updated on Jun 2 2026 5:41 AM

సాక్షి, మహబూబాబాద్‌: నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమ ఫలితంగా స్వరాష్ట్రం సాకారమై పుష్కరకాలం అయ్యింది. పన్నెండేళ్లలో మారుమూల ప్రాంతమైన మానుకోట రూపురేఖలు మారాయి. రాష్ట్ర ఏర్పాటుతో జిల్లాగా రూపుదిద్దుకున్న మహబూబాబాద్‌ విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, తాగునీటి రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించింది. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

ప్రజల దరిచేరిన ప్రభుత్వ పాలన..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మానుకోట ప్రాంతం మూరుమూలంగా ఉండేది. ఉమ్మడి జిల్లా నుంచి 16 మండలాలు, ఖమ్మం జిల్లా నుంచి రెండు మండలాలు కలుపుకొని మొత్తం 18 మండలాలతో జిల్లా ఏర్పడింది. కాగా, అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట సమీకృత జిల్లా కార్యా లయాల సముదాయ భవనంలో కొలువుదీరాయి. దీంతో జిల్లా ప్రజలు సుదూర ప్రాంతానికి వెళ్లకుండా మానుకోటలోనే అన్నిశాఖల అధికారులు, కలెక్టర్‌, ఎస్పీ వంటి ఉన్నత ఉద్యోగులను నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం వచ్చింది.

చెరువులకు చేరిన సాగునీరు..

ప్రధానంగా ఎస్సారెస్పీ కాల్వ స్టేజీ–1 ద్వారా కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్‌, చిన్నగూడూరు మండలాల్లోని 18,174 ఎకరాలకు, స్టేజీ–2 ద్వారా దంతాలపల్లి, నర్సింహులపేట, తొర్రూరు, మరిపెడ మండలాల్లోని 84,200 ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీంతో నిండు వేసవిలో కూడా చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. వీటితోపాటు 1,560 చిన్ననీటి వనరుల అభివృద్ధిలో భాగంగా రూ.142.56కోట్లతో 36 చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలు పూర్తయితే మరో 10,163 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

ప్రజలకు చేరువలో ప్రభుత్వ వైద్యం..

జిల్లాకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, అనుబంధ నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని 330 పడకలకు పెంచారు. ఈమేరకు అదనపు భవనాలు నిర్మించారు. నర్సింగ్‌, మెడికల్‌ కళాశాలల భవనాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. రూ.2.73 కోట్ల వ్యయంతో డయాగ్నోస్టిక్‌ కేంద్రం ఏర్పాటు చేసుకొని పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు బ్యాచ్‌ల మెడికోలు, నర్సింగ్‌ విద్యార్థులు కళాశాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా రోగులకు సేవలు అందిస్తున్నారు. మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రి కావడంతో 240 మంది నర్సులు, 164 మంది డాక్టర్లతో సేవలు అందుతున్నాయి. 21పీహెచ్‌సీలు, నాలుగు సీహెచ్‌సీలలో ప్రభుత్వ వైద్యం అందిస్తున్నారు.

పెద్ద చదువులు జిల్లాలోనే..

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లబోధన అమలు చేయడంతో పాటు 15 కేజీబీవీల ద్వారా బాలికా విద్య, మోడల్‌ స్కూళ్లలో మెరుగైన బోధన అందిస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా 19ఆశ్రమ పాఠశాలలు, ఆరు వసతి గృహాలు, తొమ్మిది కాలేజీలకు సంబంధించి బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేశారు. కొత్తగూడ, బయ్యారం, గూడూరు ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందిస్తున్నారు. అదే విధంగా కేసముద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, మహబూబాబాద్‌లో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల, హార్టికల్చర్‌ కళాశాలతో పెద్ద చదువులు పేదల దరికి చేరాయి.

తీరిన తాగునీటి కష్టాలు..

జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందుతోంది. ఇందుకోసం రూ.286.33కోట్లతో 1,283 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు వేసి 1,225 హాబిటేషన్ల పరిధిలో 80,455 ఇళ్లకు తాగునీరు అందిస్తున్నారు. దీంతో వేసవిలో తాగునీరు ఇబ్బందులు లేని జిల్లాగా మహబూబాబాద్‌ రూపుదిద్దుకుంది. ఈ పథకంతో వేసవిలో కూడా తాగునీటి సమస్య రాకుండా చెక్‌ పెట్టారు.

తండాల్లో రాజ్యం..

జిల్లాలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో తండాల్లో గిరిజనుల రాజ్యం వచ్చింది. గతంలో జిల్లాలో 222 గ్రామ పంచాయతీలు ఉండగా.. మరో 239 తండాలను నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతో గిరిజనులే అక్కడ సర్పంచ్‌లుగా ఉంటూ తండాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. అదేవిధంగా మేజర్‌ గ్రామ పంచాయతీలుగా ఉన్న తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌, కేసముద్రం మున్సిపాలిటీలుగా రూపుదిద్దుకున్నాయి. తొర్రూరు రెవెన్యూ డివిజన్‌గా మారి ఆయా ప్రాంతాల ప్రజలకు సేవలు మరింత చేరువయ్యాయి.

స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రగతి

జిల్లా కేంద్రంగా మానుకోట వృద్ధిబాట

మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలల

ఏర్పాటుతో వైద్యం చేరువ

నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

రంగం 2014 2026

సాగుభూమి(ఎకరాలు) 2,39,826 4,77,721

విద్యుత్‌ కనెక్షన్లు 2,47,357 2,95,674

చేపల ఉత్పత్తి(టన్నులు) 15,138 24,764

అక్షరాస్యత శాతం 57.13 67.34

భగ్గుమన్న మానుకోట

తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేకస్థానం

మానుకోట కేంద్రంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగింది. మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి తమ నిరసన తెలిపారు. రైల్‌రోకోలు, వంటావార్పులు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో జేఏసీ కీలక పాత్ర పోషించింది. జేఏసీ కన్వీనర్‌ డోలి సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకూ అలుపెరుగని పోరాటం చేశారు. ఈక్రమంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొనసాగాయి.

Advertisement
 
Advertisement
Advertisement