● తొర్రూరు ఆర్డీఓ గణేష్
● 21 అర్జీల స్వీకరణ
తొర్రూరు: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తొర్రూరు ఆర్డీఓ జి.గణేష్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల నుంచి 21 దరఖాస్తులు అందాయి. 14 భూ సంబంధిత, 4 పంచాయతీరాజ్ శాఖ, 2 మున్సిపాలిటీ, ఒకటి కార్మిక శాఖకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాలకు సంబంధించిన వారు ఆర్డీఓకు ఫిర్యాదులు అందించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ వినతిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ పుల్లారావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి, ఏఎల్‌ఓ రవి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ కె.అనిల్‌కుమార్, ఎకై ్సజ్ ఎస్సై శంకర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి, ఏఓ రాంనర్సయ్య, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
విధుల్లోకి తీసుకోకుంటే చావే శరణ్యం..
తొర్రూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన మంగళపల్లి ప్రసాద్ మున్సిపాలిటీలో కొంత కాలంగా తాత్కాలిక కార్మికుడిగా పని చేస్తున్నాడు. 2015 ఆగస్టు నుంచి తనను విధుల్లోకి రాకుండా కమిషనర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, రెండు మాసాల వేతనాలు సైతం నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను విధుల్లో చేరకుండా అడ్డుకుంటే చావే శరణ్యమని బాధితుడు తెలిపాడు. సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి..
తొర్రూరు మండలం నాంచారిమడూరు గ్రామానికి పాము సత్యనారాయణకు గ్రామంలో సొంతిల్లు, ఇంటి స్థలం కూడా లేదు. దీంతో గ్రామంలో అద్దెకు నివాసముంటున్నాడు. ప్రభుత్వం ఇంటి స్థలం ఉన్నవారికే ఇందిరమ్మ ఇస్తున్న క్రమంలో అతడికి ఇల్లు మంజూరు కాలేదు. దీంతో బాధితుడు తనకు ఇంటి స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరాడు.
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్: ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మానుకోట ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీఓ కృష్ణవేణి మాట్లాడుతూ.. వినతులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వినతులను పరిష్కరించాలని, పరిష్కారం కాకపోతే వివరాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. ప్రజావాణిలో 5 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్‌స్థాయి అధికారులు పాల్గొన్నారు.


