‘కార్పొరేట్‌’ వల! | - | Sakshi
Sakshi News home page

‘కార్పొరేట్‌’ వల!

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

ఇంటర్‌లో ప్రవేశాలకు ఫోన్‌ కాల్స్‌

ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల పోటీ

రంగంలోకి పీఆర్‌ఓలు..

ఒక్కో ప్రవేశానికి రూ.10వేల కమీషన్‌

తొర్రూరు: ఇంటర్‌లో ప్రవేశాలకు కార్పొరేట్‌, ప్రైవేట్‌ కళాశాలలు రంగంలోకి దిగాయి. పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలు వెలువడడంతో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రైవేట్‌ కళాశాలల ప్రతినిధులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. కళాశాలల పీఆర్‌ఓలు అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నారు. ప్రవేశాల కోసం ముందస్తుగా తల్లిదండ్రులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్ల వ్యాపారం సాగిస్తున్నారు. పేరు మోసిన తమ కళాశాలలో సీట్లు దొరకవని త్వరపడాలని చెప్పి ఆందోళనకు గురి చేస్తున్నారు. ముందుగా అడ్మిషన్‌ బుక్‌ చేసుకుంటే ఫీజు రాయితీ ఉంటుందని మాయ చేస్తున్నారు. లేదంటే ఫీజులు పెరుగుతాయని భయపెడుతున్నారు. ముందుగానే సీటు రిజర్వ్‌ చేసుకోకపోతే తర్వాత కోరిన బ్రాంచ్‌లో సీటు దొరకదని బెదరగొడుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు హనుమకొండ, వరంగల్‌, హైదరాబాద్‌, ఖమ్మంలలోని పేరు మోసిన కార్పొరేట్‌ కాలేజీల్లో అడ్మిషన్లు పొందినట్లు సమాచారం.

ప్రవేశాల కోసం తీవ్ర ప్రయత్నాలు..

జిల్లాలో 8,152 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తే 8,055 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో చాలా మంది విద్యార్థులు ఇంటర్‌ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిని ఆకర్షించేందుకు ఇప్పటికే ప్రైవేట్‌ కళాశాలలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. జిల్లాలోని పదో తరగతి విద్యార్థుల అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు కన్సల్టెన్సీలు, ప్రైవేటు కళాశాలల పీఆర్‌ఓలకు చేరాయి. విద్యార్థుల అడ్రస్‌లు కనుక్కొని వారి ఇళ్లకు వెళ్లి సీట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ సీట్లు బుక్‌ చేస్తే కమీషన్లు లభిస్తుండటంతో పీఆర్‌ఓలు తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కమీషన్‌ అందుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంటర్‌ అడ్మిషన్లకు ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులు, ఆర్‌ఎంపీలను సైతం రంగంలోకి దించి ఒక్క విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు కట్టిస్తే పదిశాతం డబ్బులు ముట్టజెప్పేందుకు పీఆర్‌ఓలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. నేటి నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభమవుతుండగా.. అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement