కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలో నిల్చొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఎఫ్‌ఆర్వోగా వంశీకృష్ణ
కొత్తగూడ: కొత్తగూడ అటవీ క్షేత్రాధికారిగా వంశీకృష్ణను నియమిస్తూ పీసీసీఎఫ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న వజరహత్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో వాజేడు–వెంకటాపురం నుంచి వంశీ కృష్ణను కొత్తగూడకు బదిలీ చేశారు.
సరిత ఖమ్మం
ఆత్మ పీడీగా బదిలీ
● నూతన జిల్లా వ్యవసాయ అధికారిగా విజయ్‌చంద్ర
మహబూబాబాద్ రూరల్ : జిల్లా వ్యవసాయ అధికారి బి.సరిత ఖమ్మం ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మధిర ఏడీఏగా పనిచేస్తున్న ఎస్.విజయ్ చంద్ర పదోన్నతిపై జిల్లా వ్యవసాయ అధికారిగా రానున్నారు. మరిపెడ ఏడీఏగా పనిచేస్తున్న వి.విజయ్ చంద్ర పదోన్నతిపై హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారిగా బదిలీ అయ్యారు. జిల్లా పరి ధిలో పనిచేస్తున్న ఏఈఓల బదిలీల కౌన్సిలింగ్ పూర్తికాగా.. మండల వ్యవసాయ అధికారుల కౌన్సిలింగ్ జరిగినప్పటికీ బదిలీలపై ఎలాంటి స్పష్టత రాలేదు.
కేసముద్రం మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ బదిలీ
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్‌రావును నల్లగొండ జిల్లా హాలియా మార్కెట్‌కు బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా పదోన్నతిపై కేసముద్రం మార్కెట్‌కు వచ్చిన అమరలింగేశ్వర్‌రావు మూడున్నరేళ్ల పాటు పనిచేశారు.
పొగాకు ఉత్పత్తుల వాడకం హానికరం
మహబూబాబాద్ రూరల్: పొగాకు ఉత్పత్తుల వాడకం హానికరమని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ వి.రాజ్ కృష్ణ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సబ్ జైలులో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించి రిమాండ్ ఖైదీలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రాజ్ కృష్ణ మాట్లాడుతూ.. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే నష్టాలను, ప్రాణాంతక వ్యాధుల గురించి వివరించారు. ధూమపానం, గుట్కా వంటి అలవాట్లు మనిషి ఆరోగ్యాన్నే కాకుండా, వారి కుటుంబాలను కూడా ఆర్థికంగా, సామాజికంగా రోడ్డున పడేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు జీవితం అనేది ఒక పరివర్తనకు వేదిక కావాలని, ఇక్కడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెడు అలవాట్లను వీడి, ఆదర్శవంతమైన పౌరులుగా మారాలని పిలుపునిచ్చారు. పొగాకు వంటి చెడు వ్యసనాలకు బానిసై వాటి నుంచి బయటపడాలని కోరుకునే వ్యక్తులకు ప్రభుత్వ ఆస్పత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ తగిన సహాయం అందిస్తుందని తెలిపారు.
ఎంసీఏ సెకండియర్
రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు (సీబీసీఎస్), (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈ నెల 8నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. 8న మొదటి పేపర్, 10న రెండో పేపర్, 12న మూడో పేపర్ పరీక్షలు ఉంటాయన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు.


