● నాలుగు రోజులుగా నిలిచిన
భగీరథ నీటి సరఫరా
● మున్సిపాలిటీ ప్రజలకు తీరని దాహం
ఏటి నిండా నీరున్నా .. డోర్నకల్‌లో తాగునీటి కష్టాలు
డోర్నకల్: ఓ వైపు తీవ్రమైన ఎండలు.. మరోవైపు తాగునీటి కష్టాలతో డోర్నకల్ మున్సిపాలిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, పట్టణానికి ప్రస్తుతం భగీరథ నీటిని సరఫరా జరుగుతోంది. అయితే కొన్ని నెలలుగా వివిధ కారణాలతో తరచూ నీటి సరఫరా నిలవడం, పట్టణంలో పలు అభివృద్ధి పనుల కోసం తవ్వకాలు జరపడంతో పైపులైన్లు పగిలి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాలుగు రోజులుగా..
ప్రస్తుతం పట్టణంలో నాలుగు రోజులుగా భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఎండలతో బావులు, బోర్లలో నీటి నిల్వలు అడుగంటి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెద్ద చెరువులోని నాలుగు బోరుబావుల ద్వారా ఎస్సీబీసీ కాలనీ, రాజుతండా, పంపుబావితండా, సుభాష్‌వీధి తదితర ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కిరీటాపురం, బంకట్‌సింగ్‌తండా తదితర ప్రాంతాలకు ఆయా ప్రాంతాల్లోని బోరుబావుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, మున్సిపాలిటీ సిబ్బంది పలు వార్డుల్లో ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ప్రజల అవసరాలు పూర్తిస్థాయిలో తీరడం లేదు.
మున్నేరులో నీరున్నా..
డోర్నకల్ పట్టణ సమీపంలోని మున్నేరువాగు ఆనకట్టలో ప్రస్తుతం నిండుగా నీటి నిల్వలు ఉన్నాయి. గతంలో మున్నేరువాగు నుంచి డోర్నకల్‌కు తాగునీటిని సరఫరా చేసేవారు. వాగు వద్ద పంప్‌హౌస్, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి పైపులైన్ ద్వారా సమ్మర్ స్టోరేజికి నీటిని సరఫరా చేసి అక్కడ నీటిని శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఆనకట్ట నిండుగా నీరున్నా పంప్‌హౌస్‌లో విద్యుత్ మోటార్లు లేవు. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించారు. గతంలో పంప్‌హౌస్‌లో 30హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ మోటార్లు ఉండగా దొంగల భయంతో వాటిని మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచారు. మున్సిపాలిటీ పాలకవర్గం, సిబ్బంది స్పందించి మున్నేరువాగు ఆనకట్ట వద్ద పంప్‌హౌస్‌లో విద్యుత్ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి పట్టణానికి తాగునీటిని సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు.


