మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాల్లో కొతపెట్టడం సరికాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలాష్టి రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి విధి విధానాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారిక ప్రకటన లేకుండా ముందస్తు సమాచారం లేకుండానే మే నెల జీతం నుంచి 1.5శాతం మొత్తాన్ని హెల్త్ కార్డు పేరుతో మినహాయించడం అన్యాయమైన చర్య అని మండిపడ్డారు. ఈహెచ్‌ఎస్ రికవరీ సొమ్మును తిరిగి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు చీకటి ఉపేందర్, కార్యదర్శి రాచకొండ ఉపేందర్, నాయకులు ప్రభాకర్, విద్యాసాగర్, విజయ్‌కుమార్, శివకుమార్, రాజు, వెంకటేశ్వర్లు, మురళి, కార్తీక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అత్యంత దారుణం..
ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగుల జీతాల నుంచి 1.5శాతం మొత్తాన్ని కట్ చేయడం అత్యంత దారుణమని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం యూనియన్ జిల్లా అధ్యక్షుడు పూసపాటి నాగముణి అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు లక్ష్మికాంత్, నాయకులు వీరన్న, అశోక్, శంకర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


