పుష్కరం.. సాంస్కృతిక సంరంభం | - | Sakshi
Sakshi News home page

పుష్కరం.. సాంస్కృతిక సంరంభం

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి రాత్రి సుమారు 40వేల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. శనివారం తెల్లవారుజాము నుంచి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో స్వామివారు, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. తెలంగాణతో పలు పలు రాష్ట్రాల నుంచి వివిధ వాహనాల్లో తరలొచ్చారు.

వీఐపీ ఘాట్‌ నుంచి ఆలయానికి..

ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో తరలి రావడంతో పార్కింగ్‌ స్థలాలు వాహనాల రద్దీతో కళకళలాడాయి. పుష్కర ఘాట్‌ ప్రాంతంలో రద్దీతో నెలకొనడంతో పోలీసులు ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చర్యలు చేపట్టారు. పార్కింగ్‌ స్థలాల వద్ద వాహనాలు నిలపడంతో షటిల్‌ బస్సులు, ఆటోల ద్వారా భక్తులు పుష్కర ఘాట్‌కు, అక్కడి నుంచి ఆలయానికి తరలి వెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం 6 గంటల తర్వాత మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్ల ద్వారా ప్రాకారదేవతలకు మొక్కుతూ దర్శనాలు చేసుకున్నారు. ఆలయంలో శివకల్యాణ మండపం వద్ద యాగశాలలో వేద పండితులు ధన్వంతరి హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, పుష్కర స్నానాలు, ఆలయంలో పూజలు చేసిన తర్వాత భక్తులు సింగరేణి భవనం సమీపంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

పీఠాధిపతి పూజలు..

కర్నాటకకు చెందిన భీమనకట్ట పీఠాధిపతి శ్రీ రాఘవరేంద్ర తీర్థస్వామిజీ పుష్కర స్నానం చేశారు. నదీమాతకు పసుపు, కుంకుమ, చీరసారె సమర్పించి పూజలు చేశారు. అనంతరం శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి వారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందాదేవి, శ్రీసరస్వతిఅమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరంపర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన అలరించింది.

నవరత్నమాల హారతికి భక్తుల తాకిడి:

కాశీ పండితులతో నిర్వహిస్తున్న నవరత్నమాల హారతికి భక్తుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో శనివారం భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో పాటు మహారాష్ట్రలోని సమీప గ్రామాల భక్తులు హాజరై కనులారా చూసి తరించారు. అనంతరం తెప్పోత్సవాన్ని హంసవాహనంలో ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి పూజాకార్యక్రమాలతో జలవిహారం చేశారు.

యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి..

రానున్న రెండు రోజులు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. పుష్కర ఘాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణ, వైద్య సేవలు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఎండల నుంచి రక్షణ చర్యలు తదితర అంశాలపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

అంత్య పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

వైభవంగా నవరత్నమాల హారతి,

తెప్పోత్సవం

కర్నాటక భీమనకట్ట పీఠాధిపతి పూజలు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Advertisement
 
Advertisement
Advertisement