ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బతో శనివారం ఏడుగురు
మృతి చెందారు. ఆయా కుటుంబాలతోపాటు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వరంగల్ జిల్లాలో..
కాశిబుగ్గ/రాయపర్తి : వరంగల్ కాశిబుగ్గలో నివాసం ఉంటున్న పులిచెరి సరోజన (82) శనివారం ఉదయం శివాలయం పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేయడానికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి చేరుకుని వడదెబ్బతో అస్వస్థతకు గురై చనిపోయింది. అలాగే, రాయపర్తి మండలం పెర్కవేడుకు చెందిన కొంక మల్లయ్య(45) ఇటీవల ఎండలో పనులకు వెళ్లాడు. దీంతో వడదెబ్బతో అస్వస్థతకు గురై శనివారం చనిపోయాడు.
ములుగు జిల్లాలో..
ములుగు రూరల్/ ఏటూరునాగారం : ములుగు జిల్లా కేంద్రానికి చెందిన పైడిమల్ల శంకర్(53) కలెక్టరేట్ వెళ్లే రహదారిలో శనివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందాడు. అలాగే, ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కుమ్మరి ముత్తయ్య(58) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. దీంతోపాటు దంచికొడుతున్న ఎండలకు అస్వస్థతకు గురై శనివారం మృతి చెందాడు.
మహబూబాబాద్ జిల్లాలో..
నెల్లికుదురు/బయ్యారం: నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన చదల ధర్మయ్య (70) మండుతున్న ఎండలకు శనివారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. అలాగే, బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన తాపీ మేసీ్త్ర కొత్త చంద్రశేఖర్(33) శనివారం ఉదయం పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అనంతరం అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మృతి చెందాడు.
జనగామ జిల్లాలో..
రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లికి చెందిన భీమగోని సత్తమ్మ (53) ఎండ వేడిమికి తట్టుకోలేక శనివారం మధ్యాహ్నం వడదెబ్బతో అస్వస్థకు గురై చనిపోయింది.
సత్తమ్మ(ఫైల్)


