మొగుళ్లపల్లి : కూలీ పనులు చేసుకొ ని జీవనం సాగిస్తున్న రెండు కుటుంబాలు, వ్యవసాయాన్నే నమ్ముకున్న మరో కుటుంబంలో విషాదం అలు ముకుంది. వ్యవసాయ బావి పూడిక తీత పనులకు వెళ్లి మరి కొద్దిసేపట్లో ఇంటికి వెళ్దామనుకునే సమయంలో చోటు చేసుకున్న ప్రమాదం మూడు ఇళ్లను శోక సముద్రంలో ముంచింది. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామానికి చెందిన సుకినే దేవరావుకు చెందిన వ్యవసాయ భూమిలో సిద్దిపేటకు చెందిన శివరాత్రి కనకరాజు తన క్రేన్‌తో పూడిక తీత పనులు ప్రారంభించాడు. శనివారం సాయంత్రం కనకరాజు బావిలోనే ఉండగా, యజమాని దేవరావు (48), పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడయ్య(53), దేవరావు సోదరుడు సుకినే మోహన్‌రావు, బండారి అభిలాశ్(16) బావి పై భాగంలో క్రేన్ మీద ఉండి రాయిని పైకి లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో క్రేన్‌తో సహా పైన ఉన్న నలుగురు బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో మోహన్‌రావు మినహా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.
అరుపులు.. కేకలు
పెద్ద రాయిని పైకి లాగలేకపోయిన క్రేన్ ఒక్కసారిగా బావిలోకి పడబోయింది. ఈ క్రమంలో పైన ఉన్న దేవరావు, పైడయ్య, అభిలాశ్, మోహన్‌రావు సైతం అదుపు తప్పి బావిలో పడబోతుండగా బావిలో ఉన్న కనకరాజు భార్య లక్ష్మి కేకలు వేసింది. క్రేన్ బావిలో పడుతుందని, పక్కకు జరగాలని భర్తకు సూచించింది. దీంతో బావి ధరి అంచున ఉండడంతో కనకరాజు ప్రాణాలతో బయటపడ్డాడు. అతను తేరుకుని చూసే సరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఘటన నుంచి లక్ష్మి తేరుకున్నాక బావిలోని మృతదేహాలను చూసి కేకలు వేసింది. దీంతో ఈ కేకలు విన్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. చిట్యాల సీఐ మల్లేశ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మోహన్‌రావుకు తీవ్ర గాయాలు కాగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
పరీక్ష రాసొచ్చిన కొద్ది సేపటికే మృత్యుఒడికి..
కొర్కిశాల గ్రామానికి చెందిన బండారి అభిలాశ్ శని వారం పదో తరగతి వార్షిక పరీక్ష తెలుగు రాసి మ ధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికొచ్చాడు. తన ఇంటి సమీపంలో బావి వద్ద క్రేన్ నడుస్తుండడంతో అక్కడికి వెళ్లి కూర్చున్నాడు. ఈ ఘటనలో అభిలాశ్ సైతం అక్కడికక్కడే మృతి చెందాడు. తొలి పరీక్షే చివరి పరీక్ష అయిందంటూ మృతుడి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. అభిలాశ్ మృతి విషయం తెలుసుకున్న స్నేహితులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కాగా, మృతుడు దేవరావుకు భార్య, ఇద్దరు కుమారులు, పైడయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, అభిలాశ్‌కు చెల్లి ఉంది. ఒకే రోజు ముగ్గురు మృతి చెందడంతో కొర్కిశాల రోదించింది. గ్రామంతోపాటు మండలంలో విషాదఛాయలు అలుముకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు.
వ్యవసాయ బావిలో క్రేన్ పడి
ముగ్గురి మృతి
అందులో ఒకరు పదో తరగతి విద్యార్థి
మూడు ఇళ్లలో విషాదం


