ఖిలా వరంగల్ : ఆ యువకులిద్దరు బంధువులు.. వరుసకు అన్నదమ్ములు.. ఎక్కడికై నా కలిసే వెళ్తా రు. ఇదే మాదిరి సెకండ్ హ్యాండ్ కారును వేలంలో దక్కించుకోవాలని ఉదయమే బైక్‌పై బయలుదేరారు. ఐనవోలు క్రాస్ వద్ద ఓ కంపెనీ నిర్వహించిన వేలంలో పాల్గొన్నారు. ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణమైన వీరిని మృత్యువు బలితీసుకుంది. బైక్‌ను వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం మామునూరు పోలీస్ స్టేషన్ ఎదుట చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన శ్రీపతి రాజేశ్(35), వర్ధన్నపేటకు చెందిన శ్రీపతి వంశీ (26) ఉపాఽధి, ఉద్యోగ రీత్యా వరంగల్‌లో ఉంటున్నారు. వంశీ కాశిబుగ్గలో నివాసముంటూ ఓ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తుండగా.. రాజేశ్ రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రోడ్డులో నివాసముంటూ రాజరాజేశ్వర సిమెంట్ షాపు ఏర్పాటు చేసుకుని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రాజేశ్, వంశీ సోదరులైనా స్నేహితులుగా ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరు శనివారం ఉదయం బైక్‌పై ఖిలా వరంగల్ మండలం పున్నేలు క్రాస్ వద్ద ఓ ఫైనాన్స్ సంస్థ నిర్వహించిన కారు వేలంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం తిరిగి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. పది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటామని కుటుంబ సభ్యులకు చెప్పుకున్నారు. ఇంతలోనే ప్రాణాలు వదిలారు. బైక్ మామునూరు పోలీస్ స్టేషన్ ఎదుటకు చేరుకుంది. ఈ సమయంలో వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపునకు వెళ్తున్న ఓ కంపెనీ పాల వ్యాన్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. దీంతో రాజేశ్, వంశీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈవిషయం తెలిసి ఎస్సై శ్రీకాంత్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వ్యాన్ డ్రైవర్‌ను అదపులోకి తీసుకుని మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు.
డ్రైవర్ మద్యం మత్తుతోనే ప్రమాదం..
ప్రమాద సమయంలో పాల వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా రాగానే కళ్లు మూతలు పడి వాహనం అదుపు తప్పి ఎదురుగా బైక్‌ను ఢీకొందన్నారు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారని వారు పేర్కొన్నారు.
బైక్‌ను ఢీకొన్న వ్యాన్..
అన్నదమ్ముల దుర్మరణం
మామునూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఘటన
ప్రమాదానికి వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తే కారణం!


