పురపోరు ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

పురపోరు ప్రశాంతం

Feb 12 2026 11:25 AM | Updated on Feb 12 2026 11:25 AM

పురపో

పురపోరు ప్రశాంతం

ఐదు మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్‌
పెరిగిన ఓటింగ్‌ శాతం

కేసముద్రం: బారులుదీరిన ఓటర్లు

ఉదయం నుంచి బారులుదీరిన ఓటర్లు

జిల్లాలో 78.90 శాతం పోలింగ్‌

సాక్షి, మహబూబాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ బుధవారం సాయంత్రం ముగిసింది. చిన్నచిన్న ఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కొన్నిచోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేయడం, ఓటర్లను ప్రలోభ పెట్టడం, భయాందోళనకు గురి చేయడం, ఒకరికి బదులు మరొకరు ఓటు వేసేందుకు వచ్చి పట్టుపడడం వంటి సంఘటనలతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల రంగప్రవేశంతో గొడవలు సద్దుమణిగాయి. మహబూబాబాద్‌, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌, కేసముద్రం మున్సిపాలిటీల్లో మొత్తం 1,27,682మంది ఓటర్లకు గాను 1,00,744 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా..78.90 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇందులో పురుషుల ఓటింగ్‌ 78.65శాతం, మహిళల ఓటింగ్‌ 79.15శాతం నమోదైంది. కాగా, కేసముద్రం మున్సిపాలిటీలో అత్యధికంగా 86.14శాతం పోలింగ్‌ నమోదు కాగా.. అత్యల్పంగా మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో 75.60శాతం నమోదైంది.

మందకొడిగా ప్రారంభమై..

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉదయం 7గంటలకు మందకొడిగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 11గంటల వరకు మోస్తరుగా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. మధ్యాహ్నం వరకు పోలింగ్‌ కేంద్రాలన్నీ ఓటర్లతో కిక్కిరిసిపోయాయి. సమయం ముగిసేకొద్ది ఓటు వేయని ఓటర్లపై అభ్యర్థులు దృష్టి పెట్టి పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చారు.

గత ఎన్నికలతో పోలిస్తే మూడు మున్సిపాలిటీల్లో అధికం

మానుకోటలో తగ్గిన ఓటింగ్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఓట్లు వేసేందుకు ఓటర్లు పోటీ పడగా.. మరికొన్ని చోట్ల నిరుత్సాహం చూపారు. 2020లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీల్లో పోలింగ్‌ శాతం పెరిగింది. అదేవిధంగా జిల్లా కేంద్రం మహబూబాబాద్‌లో మాత్రం పోలింగ్‌ శాతం తగ్గింది. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మూడు మున్సిపాలిటీల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ముందుకు రాగా.. పట్టణ జనాభా.. ప్రధానంగా విద్యావంతులు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉన్న వార్డుల్లో పోలింగ్‌ శాతం తగ్గింది. పోలింగ్‌ శాతం పెరగడానికి డబ్బులు, పలోభాలే కారణం అని పలువురు చెబుతుండగా.. పట్టణాల్లోని పలు వార్డుల్లో పోటీచేసిన అభ్యర్థులు అందరికి కావాల్సిన వారు కావడంతో ఒకరికి ఓటు వేస్తే.. మరొకరికి అన్యాయం చేసినట్లు అవుతుందని ఓటు వేసేందుకు రాలేదని పలువురు చెబుతున్నారు.

ఐదు మున్సిపాలిటీల్లో పోలైన ఓట్ల వివరాలు

మున్సిపాలిటీ మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం పోలింగ్‌ శాతం

మహబూబాబాద్‌ 65,712 23,784 25,873 24 49,681 75.60

తొర్రూరు 21,451 8,134 8,588 8 16,730 77.99

మరిపెడ 13,687 5,712 5,971 0 11,683 85.36

డోర్నకల్‌ 10,869 4,228 4,672 0 8,900 81.88

కేసముద్రం 15,963 6,652 7,098 0 13,750 86.14

పురపోరు ప్రశాంతం1
1/1

పురపోరు ప్రశాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement