ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్
మహబూబాబాద్/ మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పలోఇంగ్ కేంద్రంలో కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 19వ వార్డు పరిధిలోని పోలింగ్ కేంద్రంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఓటు వేశారు.
పోలింగ్ కేంద్రాల సందర్శన
మహబూబాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం ఎస్పీ శబరీష్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు మున్సిపాలిటీల పరిధిలోని పలు కీలక (క్రిటికల్) పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లు, పోలీసు సిబ్బంది విధుల నిర్వహణను నేరుగా పరిశీలించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు చేస్తూ, ఎన్నికల విధులు పూర్తి అప్రమత్తతతో నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ నెల 13న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయి భద్రత కల్పించి, శాంతియుత వాతావరణంలో లెక్కింపు ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
జాతర పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ సూచించారు. బుధవారం ఆయన జాతర పనులను పరిశీలించారు. ఉత్తరద్వారం ఎదుట కల్వర్టు పనులను త్వరగా పూర్తి చేయాలని, జాతరలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించే కల్యాణ వేదిక వద్ద ఇటీవల నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి చదును చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, ఈఓ సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి అమ్మవారిని బుధవారం తెలంగాణ జ్యువెల్లరీ వెరిఫికేషన్ అధికారి, బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కట్టా అంజనీదేవి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు అలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్


